సల్మాన్ మొదలు పెడుతున్నాడు.. పవన్ చేయగలడా?

హిందీలో దబాంగ్ -3 కి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సీరిస్ లో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా మూడో పార్ట్ కోసం సల్మాన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్ ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. తొలి రెండు వెర్షన్లలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించగా.. మూడో పార్టు ఆ అవకాశం పరిణీతి చోప్రాకు దక్కనున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిసారీ సోనాక్షి నే అయితే జనాలకు బోర్ కొడుతుంది, రొటీన్ అవుతుందన్న భావనతో హీరోయిన్ ని మారుస్తున్నట్టున్నారు.

మరి హిందీలో దబాంగ్ పార్ట్ త్రీ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా మూడోపార్టుకు రెడీ అవుతాడా? అనేది ఆసక్తికరంగా నిలిచే అంశం. దబాంగ్ కు రీమేక్ గానే పవన్ గబ్బర్ సింగ్ రూపొందించాడు. హిందీ సీక్వెల్ తో సంబంధం లేకపోయినా పవన్ దగ్గరుండి తన క్రియేటివిటీని చూపిస్తూ గబ్బర్ సింగ్ -2 ని 'సర్దార్ గబ్బర్ సింగ్' పేరుతో రూపొందించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినా.. గబ్బర్ సింగ్ ప్రాంచైజ్ లో మూడో సినిమా తీస్తానని అప్పట్లో పవన్ ప్రకటించాడు.

గబ్బర్ సింగ్ కు మూడో పార్టు ఉంటుందనేది స్వయంగా పవన్ ప్రకటించిన విషయమే. మరి హిందీలో గబ్బర్ సింగ్ మాతృకకు మూడో పార్టు వస్తున్న నేపథ్యంలో పవన్ కూడా మూడో పార్టు విషయంపై దృష్టి పెడతాడేమో చూడాలి! సెకెండ్ వెర్షన్ డిజాస్టర్ మరిపించే చిత్రం తీసి అభిమానులను సంతృప్తి పరుస్తాడేమో చూడాలి!

Readmore!
Show comments