హోదా నాటకంలో రెండో అంకం

ప్రత్యేక హోదా విషయంలో నడుస్తున్న నాటకం లాంటి వ్యవహారంలో రెండో అంకానికి తెరలేచినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు కేవిపి ప్రయివేటు బిల్లు పెట్టగానే తెలుగుదేశం పార్టీ హోదాపై పోరు వ్యవహారాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది. ఆ మేరకు బాబు అనుకూల మీడియా వార్తలు వండి వార్చింది. ఇంకేం లేదు బాబుకు మోడీకి విడాకులే అనేంత భ్రమ కల్పించింది. సమస్య లేదు, 2019 వరకు బాబుగారు పొరపాటున కూడా మోడీకి దూరంగా జరిగి, కోరి చిక్కులు కొని తెచ్చుకోరు అని చెప్పే వాళ్లు చెబుతూనే వున్నాయా, బాబు అనుకూల మీడియా హడావుడి ఆ రేంజ్ లోనే సాగింది.

ఇప్పుడు అది పూర్తయిన తరువాత రెండో అంకానికి తెరతీసింది. తెలుగుదేశం చేస్తున్న పోరుకు ప్రధాని మోడీ స్పందించేసారట. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారట. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించారట. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేయాలని వెంకయ్యకు ప్రధాని సూచించేసారట. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకావాలని అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ చెప్పేసారట. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేసిన తర్వాత ప్రకటన చేద్దామని వెంకయ్యతో ప్రధాని మోదీ చెప్పినట్టు సమాచారమట

భలే ఫన్నీగా లేదూ..ఇదే నిజం అనుకుంటే, పార్లమెంట్ లోనే హోదాలేదు అని చెప్పినపుడు, వివిధ పార్టీల ఎంపీలు గడబిడ చేసినపుడే, ప్యాకేజీ మీద కసరత్తు జరుగుతోందని చెప్పేవారు కదా ? ఆ కసరత్తు త్వరలో పూర్తి చేస్తాం అని చెప్పేవారు కదా?

అసలు ఈ వార్తను ఇంకోలా చదువుకోవాలేమో ? వెంకయ్య నాయుడే ప్రధాని మోడీని కలిసి ప్యాకేజీపై విన్నవించారు. బాబు ఆగ్రహిస్తున్నారని చెప్పి వుంటారు. ఆ మేరకు బాబుతో మాట్లాడండి అని ప్రధాని అని వుంటారు. దాన్ని ఈ విధంగా తిప్పి,తిప్పి బాబుకు, ఆయన పార్టీకి, మీదు మిక్కిలి వెంకయ్య నాయుడికి అనుకూలంగా ఇలా మార్చి వుంటారేమో ? అనుమానమే.  Readmore!

Show comments