చంద్రబాబు చైనా టూర్‌పై మోడీ నజర్‌!

చంద్రబాబునాయుడు తన అయిదురోజుల చైనా పర్యటనను ముగించుకుని వచ్చారు. ఏకంగా చైనాలోని అత్యద్భుతమైన కంపెనీలు అనేకం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబునాయుడు బృందంలోని ప్రతినిధులతో ఒప్పందాలు కురిచ్చేసుకున్నాయి. ఆయన తన పర్యటనలో సుమారు 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేసినట్లుగా తైనాతీ పత్రికలు కీర్తిస్తూ ఉన్నాయి. ఆలూ చూలూ లేకుండానే కొడుకు నామకరణానికి ఏర్పాట్లు చేసినట్లుగా.. కేవలం ఎంఓయూలు కుదరడంతోనే ఫ్యాక్టరీలు మరియు ఉద్యోగాలు వచ్చేసినట్లుగా తప్పెట వాయించడం అనేది చంద్రబాబు అనుచర వందిమాగధ గణానికి కొత్త విషయం ఎంతమాత్రమూ కాదు. 

అయితే ఈ సంగతులన్నీ పక్కన పెడితే.. ఆయన చైనా టూర్‌ గురించి ప్రధాని నరేంద్రమోడీ ఒకింత దృష్టి పెట్టినట్లుగా ఢిల్లీ వర్గాల్లో గుప్పుమంటోంది.  భారతదేశానికి పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఆసక్తి చూపించే అన్ని విదేశీ కంపెనీలకూ అవకాశం ఇవ్వడం అనేది సహజమే కావొచ్చు. కానీ శత్రు దేశాల విషయంలోనూ మనంఇలాగే చేస్తామా? పాకిస్తాన్‌లో పెట్టుబడి దారుల్ని కూడా ఇలాగే ఎగబడి ఆహ్వానిస్తామా? అనేది చాల పెద్ద ప్రశ్న.  

బహిరంగంగా మనం ప్రకటించకపోయినప్పటికీ.. పాకిస్తాన్‌ మీద ఉన్నంతగా శత్రుభావం చైనా గురించి మన దేశ ప్రజల్లో అవేర్‌నెస్‌ లేకపోయినప్పటికీ.. నిజానికి భారత్‌కు అత్యంత ప్రమాదకరమైన శత్రుదేశం చైనా అని విశ్లేషకులు భావిస్తుంటారు. అలాగే భద్రత పరంగా కూడా చైనాతో మనకు అనేక తగాదాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా భారత్‌ ఎదుగుదలకు చైనా అడ్డుపడుతున్న సందర్భాలు ఉన్నాయి.

 చైనా మన దేశాన్ని తమ ఉత్పాదనల ద్వారా డంపింగ్‌ యార్డ్‌ లా వాడుకుంటున్నదనే ఆరోపణలూ ఉన్నాయి.  ఇలాంటి సమయంలో చైనా పెట్టుబడిదారుల్ని చంద్రబాబు ఎగబడి ఆహ్వానించడం కేంద్రం దృష్టిని కూడా రాబడుతోంది. జపాన్‌, సింగపూర్‌, అమెరికా దేశాల పెట్టుబడిదారుల్ని, చైనా పెట్టుబడి దారుల్ని ఒకేరకంగా చూడలేం అని నిపుణులు అంటున్నారు. 

విదేశాలకు ఇలాంటి ప్రతిపాదనలు పెట్టేప్పుడు.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని.. అలాంటిదేమీ లేకుండా చంద్రబాబు అండ్‌ కో.. ఆంధ్రప్రదేశ్‌ అనేది ఓ ప్రత్యేకదేశం అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మోడీ సర్కార్‌ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ వాదనలో అసత్యం ఏమీ లేదు. కాకపోతే.. తాను ఏ పనిచేసినా సరే.. అది ఆంధ్రప్రదేశ్‌కు అత్యద్భుతం అని టముకు వాయించుకుంటూ ఉండే చంద్రబాబు నాయుడు కేంద్రానికి కలుగుతున్న అనుమానాల్ని ఎలా నివృత్తి చేస్తారో చూడాలి. 

Show comments