స్వీటు తినిపించిన ఎర్రబెల్లికి 'సీటు' ఖాయమైనట్లేనా?

దేవుడికి ఏవేవో పదార్థాలు వండి నైవేద్యంగా పెట్టక్కర్లేదని, నిజమైన భక్తితో చిన్న బెల్లం ముక్కో, చిటికెడు పంచదారో నైవేద్యంగా పెట్టినా సంతోషించి కోరిన కోర్కెలు తీరుస్తాడని ఆధ్యాత్మికవేత్తలు, టీవీలో ప్రవచనకారులు చెబుతుంటారు. ఇలా జరుగుతుందా? అనేవారికి సమాధానం లేదు. ఎవరికి వారు విశ్లేషించుకోవాల్సిందే. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడిగా భావించి, కోరిన కోర్కె తీరుస్తాడని ఆశించి ఆయన జన్మదినం రోజు స్వీటు తినిపించిన ఒక 'జంప్‌ జిలానీ'కి అనుకున్నది జరగబోయే సూచనలు కనబడుతున్నాయి. అందుకు సంబంధించి మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ జంప్‌ జిలానీ పేరు ఎర్రబెల్లి దయాకర్‌రావు. 

దశాబ్దాలపాటు టీడీపీలో కొనసాగిన ఈ వరంగల్‌ జిల్లా నాయకుడు కొంతకాలం క్రితం గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో చేరగానే కేసీఆర్‌ జన్మదినం రావడంతో ఎర్రబెల్లి తన కొత్త నాయకుడికి  దగ్గరుండి కేక్‌ (ఇది స్వీటే కదా) తినిపించారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ జాతిపితను  తిట్టినందుకు లెంపలేసుకున్నారు. పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చారు. పాపం చేశానని కుమిలిపోయారు. తాను కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని, పార్టీ 'డైరెక్షన్‌' ఇస్తే తిట్టానని, తాను అమాయకుడినని ఏడ్చారు.  తన తండ్రి భోళా శంకరుడని, మనసులో ఏం ఉంచుకోడని కేసీఆర్‌ కుమార్తె కవిత  చెప్పింది. అది నిజమని అనిపించేలా బండబూతులు తిట్టిన ఎర్రబెల్లిని కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారు. 

ఎర్రబెల్లిది రాజకీయ చేరిక కాదని, రాజకీయ పునరేకీకరణ అని ముఖ్యమంత్రి భాష్యం చెప్పారు. ఎర్రబెల్లిని అక్కున చేర్చుకున్న కేసీఆర్‌ అంతటితో ఊరుకోలేదు. ఆయనకు ఏం పదవి ఇవ్వాలా? అని ఆలోచించారట...!  తనకు మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి సన్నిహితులతో చెప్పుకున్నారు. మంత్రి పోస్టు అవకాశం లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారని చెప్పారట. శాసన మండలి కౌన్సిల్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారట. వరంగల్‌లోనే కాకుండా హోల్‌ తెలంగాణలో'జంప్‌ జిలానీ'లను వెతికి తెచ్చే బాధ్యత కూడా కేసీఆర్‌ ఈయనకు అప్పగించారని అప్పట్లో కొందరు నాయకులు చెప్పారు. 

తనను వాటేసుకొని అక్కున చేర్చుకున్న కేసీఆర్‌ వెంటనే మంత్రి పదవి ఇస్తారని ఎర్రబెల్లి అనుకున్నారు. కాని చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంచారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. సామాజికవర్గం, వరంగల్‌ జిల్లా రాజకీయాలు, ఎర్రబెల్లి శత్రువులు...ఇలా కొన్ని రీజన్స్‌ తెరమీదికి వచ్చాయి. త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎర్రబెల్లికి చోటు దక్కుతుందని అనుకుంటున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులది ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం. ఎర్రబెల్లికి పదవి ఇస్తే అదే కులం వారు మరొకరు యాడ్‌ అవుతారు. సహజంగానే దీనిపై విమర్శలొస్తాయి. 

అయినా కేసీఆర్‌ పట్టించుకునే రకం కాదని తెలిసిందే కదా. ఎర్రబెల్లికి పదవి ఇస్తే ఆయన జీవితాంతం కేసీఆర్‌కు కృతజ్ఞుడుగా ఉంటారేమో...! ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలి మంత్రి పదవి కాబట్టి. ఆయనకు మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే తన ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి సరసనే మంత్రిగా కూర్చునే అవకాశం రావడం. కడియం-ఎర్రబెల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలా భగ్గుమనడం టీడీపీలో ఉన్నప్పటినుంచే కొనసాగుతోంది. ఎర్రబెల్లికి తన జీవితంలో మంత్రి పదవి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. టీడీపీలో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల మంత్రి కాలేకపోయారు.  

అప్పట్లో తన జిల్లాకు చెందిన, తనకు ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి మంత్రి అయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు శ్రీహరిని మంత్రిని చేసింది తానేనని ఎర్రబెల్లి చెప్పుకున్నారు. తాను మంత్రి పదవిని తిరస్కరిస్తేనే ఆయనకు దక్కిందన్నారు. తాను తల్చుకుంటే క్షణాల్లో మంత్రిని అయ్యేవాడినని అనేకసార్లు చెప్పారు. ఎర్రబెల్లి టీడీపీలో ఉండగానే చిరకాల ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి గులాబీ పార్టీలో చేరడం, మంత్రి కావడం జరిగిపోయింది. వరంగల్‌ జిల్లాలోనే మరో ప్రత్యర్థి అయిన కొండా మురళి-సురేఖ దంపతులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 

ఎర్రబెల్లి టీడీపీ నుంచి బయటకు రావడానికి ఉన్న కారణాల్లో రేవంత్‌ రెడ్డికి, ఆయనకు మధ్య గొడవలు కూడా భాగమే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎర్రబెల్లి ఓపికగా 'పచ్చ' పార్టీలోనే కొనసాగారు. టీఆర్‌ఎస్‌లో చేరాక ఏదో ఒక పదవి రాకపోవడంతో అనవసరంగా వచ్చానా? అని ఫీలయ్యారట...! స్వీటు వంటి వార్త తెలిసింది కాబట్టి ఈ ఫీలింగ్‌ పోయినట్లే. 

Show comments