చంద్రబాబు చెప్పింది ముమ్మాటికీ నిజం

మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజాలు చెప్పడానికి ఇష్టపడరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాటల్లో అయితే, 'నిజం చెప్పకూడదు' అనే శాసం చంద్రబాబుకి వుందట. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. 

అసలు విషయానికి వస్తే, చంద్రబాబు - పాత పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా నిలిచారుగానీ, అంతకన్నా పెద్ద నోట్లను తీసుకురావడాన్ని మాత్రం ఆక్షేపిస్తున్నారు. 'పెద్ద నోట్ల రద్దుని స్వాగతిస్తున్నాం.. అసలు మోడీకి ఆ ఐడియా ఇచ్చిందే నేను..' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు అందరికన్నా ముందుగా. కానీ, ఏం లాభం.? చంద్రబాబు పెద్ద నోట్లను రద్దు చేయమంటే, ప్రధాని నరేంద్రమోడీ అంతకన్నా పెద్ద నోటు తీసుకొచ్చేశారు. 

ఇక, 2 వేల రూపాయల నోటుతో అవినీతి పెరిగిపోతుందనీ, నల్లధనం గుట్టలుగా పేరుకుపోతుందనీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఈ విషయంలో చంద్రబాబుతో ఎవరైనాసరే ఏకీభవించి తీరాల్సిందే. కర్నాటకలో ఇద్దరు అధికారుల నుంచి సుమారు 6 కోట్ల రూపాయల్ని ఐటీ అధికారులు కనుగొన్నారు. అందులో అత్యధికం.. సుమారు ఐదున్నర కోట్లు 2 వేల రూపాయల నోట్ల కట్టల రూపంలోనే వున్నాయి మరి.! 

దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో పట్టుబడ్డ సొమ్ము అంతా ఇంతా కాదు. అందులోనూ ఎక్కువగా కొత్త 2 వేల నోట్లే వుంటున్నాయి. అవినీతిపరులు కూడా లంచం పెద్ద నోట్లు.. అంటే 2 వేల రూపాయల నోట్ల రూపంలోనే అడుగుతున్నారు. అలాంటోళ్ళు కొందరు అడ్డంగా బుక్కయిపోతున్నారు కూడా. కేంద్రం విడుదల చేసిన 2 వేల రూపాయల నోట్లు, జనం చేతిలోకి వెళ్ళి, అట్నుంచటే బడాబాబుల సంచుల్లోకి దూకేస్తున్నాయి. ఏం చేస్తారు, 2 వేల రూపాయల నోటుని సామాన్యుడు ఎన్ని రోజులు భరించగలడు.?  Readmore!

ఏదిఏమైనా, 2 వేల రూపాయల నోటుని తీసుకురావడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ, అవినీతికి రెడ్‌ కార్పెట్‌ వేశారనీ, నల్ల దొంగలకి ఉపశమనం కల్పించారనీ చెప్పక తప్పదు. పేరుకేమో నల్ల దొంగల భరతం పట్టేందుకు.. కానీ, జరుగుతున్నదేమో, నల్లదొంగల్ని ఉత్సాహపరిచేందుకు.. ఇదీ 2 వేల రూపాయల నోట్ల ప్రస్థానం. 

అంతా బాగానే వుందిగానీ, 2 వేల నోటుతో అవినీతి పెరిగిపోతుందని చెబుతున్న చంద్రబాబు, ఆ అవినీతి మరక తమకు అంటించుకోవడం ఎందుకట.! కేంద్రంలో భాగస్వామిగా వున్న టీడీపీ, 2 వేల రూపాయల నోటుకు నిరసనగా కేంద్రం నుంచి వైదొలగొచ్చు కదా.? ఇంకా నయ్యం, ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో కయ్యం పెట్టుకోలేదు.. 2 వేల రూపాయల నోట్లతో తెలుగు తమ్ముళ్ళు పండగ చేసుకుంటోంటే, చంద్రబాబు ఎందుకు పెదవి విప్పుతారట.. ఛాన్సే లేదు.

Show comments