నిప్పు నారా చంద్రబాబునాయుడి రాజకీయ సిద్ధాంతాలు ఒక్కో చోట ఒక్కోలా వుంటాయ్. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదంతే. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ మారిన వెంటనే అనర్హత వేటు పడేలా ఫిరాయింపుల చట్టానికి సవరణలు తీసుకురావాల్సి వుందని వ్యాఖ్యానించడంపై తెలంగాణ టీడీపీ నేతలు ఒకలా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు ఇంకొకలా స్పందించడమే అందుకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓ పక్క పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, అదేదో దైవకార్యం.. అన్నట్లు చెప్పుకుంటోంటే, తెలంగాణలో టీడీపీ నేతలేమో, పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారమంటున్నారు. చంద్రబాబు సిద్ధాంతాలే ఇలా వుంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి లేఖ రాసింది తానేనని తెలంగాణలో చెబుతారాయన. అదే ఆంధ్రప్రదేశ్‌కి వెళితే, విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీదేనని చెబుతారు.
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.? అందుకే, టీడీపీ నేతలకీ 'నిప్పు' కళ్ళ సిద్ధాంతం బాగా అలవాటైపోయినట్టుంది. ఓ పక్క 'వ్యభిచారం' అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ, ఇంకోపక్క ఆ 'వ్యభిచారాన్ని' సమర్థించుకోవడం టీడీపీకి కాక ఇంకెవరికి సాధ్యమవుతుంది.? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీని కొనసాగించాలనుకుంటే చంద్రబాబుకి ఈ తిప్పలు తప్పవు. ఎందుకంటే, చంద్రబాబు ఒక్కో చోట ఒక్కో తరహా రాజకీయాలు చేస్తుంటారు మరి.! ఒకే సిద్ధాంతానికి కట్టుబడి వుంటే ఈ పరిస్థితి రాదు. రెండు చోట్లా అధికారం లేకపోతే అసలు టెన్షనే వుండేది కాదు చంద్రబాబుకి.
అన్నట్టు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు పనిగట్టుకుని వ్యాఖ్యానించడం, చంద్రబాబుకి ఆగ్రహం తెప్పించిందట. మిత్రపక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వెంకయ్యనాయుడుని చంద్రబాబు ప్రశ్నిస్తే, 'గుమ్మడికాయ దొంగ.. అంటే భుజాలు తడుముకోవడమెందుకు.?' అంటూ వెంకయ్యనాయుడు తనదైన స్టయిల్లో చంద్రబాబుకి ఝలక్ ఇచ్చారట.