సందీప్‌ రూటు మార్చాడు.. హిట్టుకొడతాడా.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? సందీప్‌ కిషన్‌ రూటు మార్చాడు. అలా ఇలా కాదు, కంప్లీట్‌ మేకోవర్‌తో డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో 'మాయవన్‌' అనే సినిమా చేస్తున్నాడు. అదీ తమిళంలో. టాలెంట్‌కి కొదవేమీ లేదుగానీ, మంచి కథల్ని ఎంచుకోవడంలో విఫలమవుతున్న సందీప్‌ కిషన్‌, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో వచ్చిన బ్రేక్‌ని కాపాడుకోలేకపోతున్నాడన్నది నిర్వివాదాంశం. 

ఇక, 'మాయవన్‌' విషయానికొస్తే, ఇందులో సందీప్‌ కిషన్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపిస్తాడు. హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌. విలక్షణ చిత్రాల్ని తెరకెక్కించే సివి కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలుత ఈ సినిమాకి 'అందాల రాక్షసి' ఫేం నవీన్‌ చంద్రని హీరోగా అనుకున్నారు. కానీ, అది కాస్తా సందీప్‌ కిషన్‌ చేతిలో పడింది. 

మొత్తమ్మీద, 'మాయవన్‌' టీజర్‌లో సందీప్‌ కిషన్‌ న్యూ లుక్‌తో, న్యూ బాడీ లాంగ్వేజ్‌తో మంచి జోష్‌ మీదున్నట్లే కనిపిస్తున్నాడు. ఆ జోష్‌ వర్కవుట్‌ అయి, సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందా.? ప్రస్తుతానికి తమిళ టీజర్‌ని విడుదల చేసిన చిత్ర దర్శక నిర్మాతలు, త్వరలోనే తెలుగు ప్రేక్షకుల కోసం మరో టీజర్‌ని విడుదల చేయనున్నారట. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది.

Show comments