ఆర్థిక కష్టాలు, లైంగిక వేధింపులపై హీరోయిన్ ఓపెన్ గా..

తాము బాగా ఎదిగిన తర్వాత తమ గతం గురించి ప్రస్తావించుకోవడానికి కొంత మంది ఇష్టపడరు. తాము కష్టాల నుంచి ఎదిగొచ్చినా.. గోల్డెన్ స్పూన్ తో పుట్టి పెరిగినట్టుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు. మరి అలాంటి తీరుకు భిన్నంగా, చాలా ఓపెన్ గా తను, తన కుటుంబం అనుభవించిన పరిస్థితుల గురించి వివరించింది పరిణీతి చోప్రా. కేవలం ఆర్థిక కష్టాల గురించే కాదు, ఆయా సమయాల్లో తనలో కలిగిన మానసికమైన భావనల గురించి కూడా ఈ హీరోయిన్ వివరించి చెప్పింది. తమది అత్యంత సాధారణ కుటుంబం అని పరిణీతి చెప్పింది.

అప్పటికే విశ్వవిఖ్యాత ప్రియాంక చోప్రాకు బంధువులం అయినప్పటికీ తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అని పరిణీతి వివరించింది. మరి మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అలాంటి కష్టాలన్నీ పరిణీతి ఎదుర్కొందట. ప్రత్యేకించి టీనేజ్ లోకి అడుగిడుతున్న దశలో తను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కష్టాలతో తల్లిదండ్రులపైనే ద్వేషం పెరిగిందని ఈమె చెప్పింది. తను హైస్కూల్ కు వెళుతున్నప్పుడు సైకిల్ మీద వెళ్లాల్సి వచ్చేదని.. అలా వెళుతున్నప్పుడు కొంతమంది కుర్రాళ్లు తనను ఏడిపించడమే పనిగా పెట్టుకునే వాళ్లని పరిణీతి చెప్పింది.

వాళ్ల వేధింపులు తీవ్రంగా ఉండేవని.. సైకిల్ కు అడ్డంగా నిలబడి తనను ఆపేవాళ్లని, ఎక్కడంటే అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్లని, స్కర్టు పట్టి లాగే వాళ్లని పరిణీతి చెబుతున్నప్పుడు సన్నటి కన్నీటి పొర ఆమె కళ్లల్లో. సైకిల్ పై కాకుండా ఆటోలోనో, టాక్సీలోనో స్కూల్ కు వెళితే వాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. కానీ.. తనను ఆటోలో కానీ, టాక్సీలో కానీ స్కూల్ పంపే స్తోమత తల్లిదండ్రులకు లేదు. దీంతో వారు తను పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకోవడం లేదని వారిపై అగ్రహం కలిగేదని, అది ద్వేషంగా మారిందని ఈ హీరోయిన్ తన టీనేజ్ ఫీలింగ్స్ ను వివరించింది.

టీనేజ్ లోని పిల్లలకు తల్లిదండ్రులపై ఏదో ఒక కారణం చేత చాలా కలిగే ఫీలింగ్సే ఇవి. తమ ఆర్థిక పరిస్థితి తల్లిదండ్రులపై తనలో అలాంటి భావనను కలిగించిందని పరిణీతీ చోప్రా చెప్పింది. అయితే ఆ తర్వాత తనలో పరిణతి వచ్చిందని, ద్వేషం మాయమైందని.. ఆర్థిక కష్టాల విషయంలో తల్లిదండ్రులపై జాలి మనసులో జనించిందని వివరించింది. మొత్తానికి రంగురంగుల లోకంలో విహరిస్తున్నా, క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్నా తన గతాన్ని పరిణీతి ఏ మాత్రం మరిచిపోలేదని స్పష్టం అవుతోంది. నిజంగానే చాలా పరిణతి చెందిన అమ్మాయే ఈ భామ.

Show comments