రోజాపై సస్పెన్షన్‌.. మరో ఏడాది.?

మరో ఏడాదిపాటు సభ నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ వేటు వేయాలని ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ రోజు ఉదయం, ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టేబుల్‌ చేసింది. గతంలో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న గలాటా నేపథ్యంలో ఇప్పటికే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు పడిన విషయం విదితమే. అయితే, అది ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, సభలో అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు.. అని సరిపెట్టేశారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు తాజా సస్పెన్షన్‌, ఎమ్మెల్యే అనితపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకట. 

'రోజా నేరమే చేశారని అనుకుందాం.. అయినా ఒక్క నేరానికి రెండు సార్లు శిక్షలు విధిస్తారా.?' అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇప్పటికే టీడీపీ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సభలోకి రోజాని రానిచ్చేది లేదంటూ, టీడీపీ గట్టి పట్టుదలతో కన్పిస్తోంది. అమరావతిలో కొత్త అసెంబ్లీ సందర్బంగా, రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా, ఆ ఆనందం ఆమెకు త్వరలో దూరమయ్యేలా వుంది పరిస్థితులు చూస్తోంటే. 

'ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేయాల్సిందే..' అని నివేదికలో పేర్కొన్న ప్రివిలేజ్‌ కమిటీ, నిర్ణయాన్ని మాత్రం శాసనసభకే వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. సభలో ఎటూ, టీడీపీదే మెజార్టీ గనుక.. టీడీపీ ఎలాగూ రోజాపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది గనుక, ఇంకో ఏడాదిపాటు ఆమెపై సస్పెన్షన్‌ వేటు తప్పకపోవచ్చు. మరోపక్క, ఈ రోజు రోజా అసెంబ్లీకి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి హాజరు కాలేకపోతున్నట్లు రోజా, స్పీకర్‌కి సమాచారం అందించారు. 

కాగా, ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ - నిర్ణయం.. సోమవారం వుండే అవకాశముంది. ఆ రోజే, రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు పడనున్నట్లు తెలుస్తోంది.

Show comments