పచ్చదళాలకు ఆర్డర్ : కేసీఆర్‌పై విరుచుకు పడండి!

ఏపీలోని తెలుగుదేశం నాయకుల్లో ఇప్పుడు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  మాటల కత్తులకు వారు పదును పెట్టుకుంటున్నారు. అదేమిటి ప్రతిరోజూ ఉండే వ్యవహారమే కదా ఇది. విపక్షనేత జగన్ మీద విరుచుకు పడుతూనే ఉంటారు కదా! అని అడక్కండి. ఈసారి ఏపీలోని తెలుగుదేశం నాయకులు అందరూ మూకుమ్మడిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆడిపోసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దల నుంచి వారికి సూచనలు అందాయి. తీవ్రమైన విమర్శలతో కేసీఆర్ మీద విరుచుకుపడాల్సిందిగా.. చంద్రబాబు కేబినెట్ లో కాస్త నోటివాటం దండిగా ఉన్న మంత్రులు, జిల్లాల్లో ఉన్న ఇతర నాయకులు అందరికీ కూడా సూచనలు వెళ్లాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటూ కేసీఆర్ ను విమర్శిస్తూ తెలుగుదేశం వారి మాటలదాడులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 

దీనికంతటికీ హేతువు కేసీఆర్ వెల్లడించిన ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం వివరాలే. ఒకవైపు చంద్రబాబునాయుడు తాను తెగ కష్టపడిపోతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి చేసేస్తా అన్నట్లుగా బీభత్సమైన బిల్డప్ లు ఇస్తున్న సమయంలో.. అసలు ఆయనకు ప్రజల్లో ఆదరణ మాత్రం దారుణంగా పడిపోయిందనే భావన కలిగేలాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మొగమాటమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా చర్చనీయాంశమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఢంకా బజాయిస్తుందని, తెదేపా 43 శాతం ఓట్లకు పరిమితం అవుతుందని తనకు తెలిసిన ఓ సర్వే ఫలితాలుగా కేసీఆర్ పేర్కొన్న వైనం పాఠకులకు తెలుసు. ఈ మాటలు సహజంగానే తెలుగుదేశం వారికి కంటగింపు కలిగిస్తున్నాయి. 

అందుకే ‘మీ సంగతి మీరు చూసుకోండి.. మీరూ మీ ప్రభుత్వమూ ప్రజల్లో ఎలా పలుచన అవుతున్నారో.. ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మీ సంగతి చూసుకోండి. మీ వైఫల్యాలను నిర్లక్ష్యం నిండిన పాలనలో దురహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారు.. దాన్ని సరిచేసుకోండి.. పొరుగు రాష్ట్రాల సంగతి మీకెందుకు??’’ లాంటి పదునైన విమర్శనారస్త్రాలను ఏపీ తెలుగుదేశం నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. వారితో పాటూ తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా కేసీఆర్ మీద ఇదే అంశంపై విరుచుకుపడడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఇవి కేసీఆర్ పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ.. తెలుగుదేశం వారికి మాత్రం చాలా అవసరం అని విశ్లేషకులు అంటున్నారు. 

Show comments