జైట్లీని ముట్టుకుంటే మోడీకి మంటెత్తుతుంది!

పృష్ఠ తాడనాత్‌ దన్త భంగః అని సంస్కృతంలో ఒక సామెత ఉంది. వీపు మీద కొడితే మూతి పళ్లు రాలినట్లు.. అని ఆ సామెతకు అర్థం! అచ్చంగా కేంద్రప్రభుత్వ రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కేంద్రమంత్రిఅరుణ్‌ జైట్లీని ముట్టుకుంటే, ఆయన మీద విమర్శలు గుప్పిస్తే.. ఆయన లోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం జరిగితే.. ప్రధాని నరేంద్రమోడీ అసహనానికి గురైపోతున్నారు. 

తాజాదృష్టాంతం ఈ విషయాన్నే చెబుతోంది. జాతీయ స్థాయిలో రకరకాల కుంభకోణాలు, అరాచకాలను గురించి.. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ, న్యాయపోరాటాలు సాగిస్తూ ఆయా నేతలకు ఊపిరి ఆడనివ్వకుండా చేయడంలో పేరు మోసిన సుబ్రమణ్యస్వామి తాజాగా అరుణ్‌జైట్లీ మీద ఫోకస్‌ పెట్టారు. ఒకవైపు సోనియా కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ, జయలలిత మీద ఆరోపణలతో విరుచుకుపడుతూ, జాతీయ స్థాయిలో భాజపా ప్రత్యర్థులను ఆటాడుకోవడంలో పేరు మోసిన సుబ్రమణ్యస్వామి , ఆర్బీఐ గవర్నరు రాజన్‌ నిష్క్రమణకు కూడా ఒక రకంగా కారణం అయ్యారని చెప్పాల్సిందే. తాజాగా కేజ్రీవాల్‌ మీద ఫోకస్‌ పెడతానని కూడా బెదిరిస్తున్నారు. అయితే ఈ మధ్యలోనే ఆయన అరుణ్‌జైట్లీ మీద కూడా విమర్శలు చేశారు. 

అయితే కేంద్రంలో ప్రభుత్వం నడపడంలో అసలు ఏమాత్రం అనుభవం లేని, కేంద్రంలో పరిపాలన నాకు అవగాహన లేని సంగతి అని ఒప్పుకునే నరేంద్రమోడీ.. ఎంతగా అరుణ్‌ జైట్లీమీద ఆధారపడి ఉన్నాడో ఈ దృష్టాంతం చెబుతుంది. కాంగ్రెస్‌ నియమించిన ఆర్బీఐ గవర్నరును తొలగించడానికి, సోనియాకుటుంబాన్ని ఇరుకున పెట్టడానికి కావాల్సినంత కాలం సుబ్రమణ్యస్వామిని యథేచ్ఛగా మాట్లాడనిచ్చిన మోడీ.. ఇప్పుడు ఆయన నోరు అరుణ్‌జైట్లీ మీదకు మళ్లే సరికి దానికి తాళం వేయాలని భావిస్తున్నారు. జైట్లీ మీద స్వామి విమర్శల నేపథ్యంలో.. ఆ కేంద్ర మంత్రి అలిగారుట. దీంతో స్పందించిన నరేంద్రమోడీ, ఆరెస్సెస్‌ పెద్దలను సంప్రదించి.. స్వామి నోటికి తాళం వేయడంగురించి వారితోనే చర్చించారుట. 

అయితే, మోడీ బ్రేకులు వేయదలచుకుంటే.. సుబ్రమణ్య స్వామి ఆగే తత్వమేనా? ఆయన తనదైన శైలిలోచెలరేగిపోకుండా ఉంటారా? అనేది వేచిచూడాలి. లేదా మోడీ/ భాజపా.. దీనిని కూడా ఒక వ్యూహంగా.. తమ పార్టీ వారి మీద స్వామి విమర్శలను ఆపించి, కేజ్రీవాల్‌ లాంటి రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రం నిరంతరాయంగా విరుచుకుపడేలా ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందేమో కూడా వేచిచూడాలి. 

Show comments