ముమైత్‌ఖాన్‌ పరిస్థితేంటి.?

ముమైత్‌ఖాన్‌కి రియాల్టీ షోలు కొత్త కాదు. గతంలో నవదీప్‌ హోస్ట్‌ చేసిన ఓ 'యాక్షన్‌ రియాల్టీ షో'లో ముమైత్‌ఖాన్‌ కన్పించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తోన్న 'బిగ్‌ బాస్‌' రియాల్టీ షోలో కన్పిస్తోంది ముమైత్‌ఖాన్‌. అయితే, ఈసారి రియాల్టీ షో వెరీ వెరీ స్పెషల్‌ ముమైత్‌ఖాన్‌కి. బిగ్‌ బాస్‌ ప్రత్యేకత అలాంటిది మరి.! 70 రోజులపాటు 'బిగ్‌బాస్‌ హౌస్‌'లో ముమైత్‌ఖాన్‌ వుండిపోవాల్సి వస్తుంది. అది కూడా పెద్ద టాస్క్‌ కాదు ముమైత్‌ఖాన్‌కి. కానీ, ఇక్కడ సమస్య వేరు.! 

డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ఖాన్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు పంపగా, ఆ లిస్ట్‌లో ముమైత్‌ఖాన్‌ పేరు కూడా వుంది. ఈ నెల 19నుంచి ఒక్కో సినీ సెలబ్రిటీ, విచారణకు హాజరు కావాల్సి వుంది. ముందుగా పూరి జగన్నాథ్‌ పేరు విన్పిస్తోంది. ఆ తర్వాత మిగతావారంతా రోజుకొకరు చొప్పున విచారణకు హాజరు కావాల్సిందే. లిస్ట్‌లో ముమైత్‌ఖాన్‌ పేరు విన్పిస్తోంది గనుక, ఆమె కూడా విచారణకు హాజరు కావాలి కదా.! 

అయితే, ఇక్కడే చిక్కు వచ్చిపడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ముమైత్‌ఖాన్‌, 'సిట్‌' విచారణకు ఎలా హాజరవుతుంది.? దీనికి ఒకే ఒక్క ఆప్షన్‌, ఆమె హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిపోవాలి. ఈ నెల 16న బిగ్‌బాస్‌ రియాల్టీ షో ప్రారంభమయ్యింది. ఇంతలోనే, స్టార్‌ 'హౌస్‌మేట్‌' ఎలిమినేట్‌ అయిపోతే ఎలా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో తెలియాలంటే.

Show comments