సల్మాన్, ఐశ్వర్య.. కలిసి ఏం మాట్లాడతారో!

సినిమా హీరోహీరోయిన్లలో బ్రేకప్ జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ బ్రేకప్ తర్వాత వాళ్లలో కొందరు.. తిరిగి సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలున్నాయి. కొన్ని ప్రేమ జంటలు మాత్రం విడిపోయాకా.. ఎదురుపడటానికి కూడా ఇష్టపడవు. ఇన్నేళ్లూ సల్మాన్ ఖాన్, ఐశ్వర్యల మధ్య ఇలాంటి పరిస్థితే కొనసాగిందని వేరే చెప్పనక్కర్లేదు. వీరు ప్రేమించుకున్నన్ని రోజులూ అంతే గాఢంగా ప్రేమించుకున్నారు.. విడిపోయిన సందర్భంలోనూ అంతే స్థాయి గొడవ చేసుకున్నారు.

బ్రేకప్ సమయంలో.. గొడవ పడి, పబ్లిక్ ఫంక్షన్లలో చెంపలు పగలగొట్టుకున్న చరిత్ర ఉంది వీళ్లకు. ఏదో సైలెంట్ గా విడిపోకుండా.. నానా గొడవా చేసుకున్నారు సల్లూ , ఐష్ లు. వీళ్ల బ్రేకప్ జరిగి దశాబ్దంన్నర కాలం గడిచిపోయినా.. ఇప్పటికీ నాటి పరిణామాలు చర్చనీయాంశాలుగానే ఉండిపోయాయి. ఆ బ్రేకప్ అనంతరం.. సల్మాన్ వేరే హీరోయిన్ల ప్రేమలో సేదతీరాడు.. ఐష్ కూడా మరో ప్రేమికుడితో కొంత కాలం గడిపి, ఆ తర్వాత అభిషేక్ ను పెళ్లి చేసుకుంది.

ఈ పరిణామాల మధ్య పదిహేను సంవత్సరాలుగా ఐష్-సల్లూలు ఎదురుపడిన సందర్భాలు మీడియాలో ఎప్పుడూ హైలెట్ కాలేదు. దీంతో వీళ్లు ఉప్పూనిప్పులా సాగుతున్నారనే అనుకోవాల్సి వస్తోంది. అయితే.. ఇకపై మాత్రం అలాంటి పరిస్థితి ఉండబోదు. ఇప్పటికే సల్లూతో నటించడానికి ఐష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!  మంచి కథ కావాలి.. సల్మాన్ తో రొమాన్స్ కు  సై అని ఆమె స్పష్టం చేసింది. మరి ఆ సినిమా సంగతలా ఉంటే.. అంతకన్నా మునుపే ఐష్, సల్మాన్ లు ఒకే తెరపై కనిపించడం ఖరారు అయ్యింది.

సల్మాన్ హోస్టు చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఐష్ గెస్టుగా హాజరు కానున్నదని తెలుస్తోంది. ‘దిల్ హే ముష్కిల్’ ప్రచారం లో భాగంగా ఆమె సల్మాన్ షోకి వెళుతుందని తెలుస్తోంది. ఈ విధంగా సల్మాన్, ఐష్ లు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఒకే స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారు. మరి ఇప్పుడు వీళ్లు తమ పాత అనుభవాల గురించి ఏమైనా మాట్లాడతారా?

Show comments