నిబంధన ముఖ్యమా? పార్లమెంటుకు వెళ్లడం ప్రధానమా?

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. రాజ్యసభ సభ్యుడైన ఏచూరి ఆగస్టులో రిటైర్‌ అవుతారు. ఆయన ఇప్పటికే రెండోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. సీపీఎం నిబంధన ప్రకారం పార్టీ సభ్యుడు రెండుసార్లకు మించి రాజ్యసభకు ఎంపిక కాకూడదు. ప్రస్తుతం ఈయన పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏచూరి తరువాత సీపీఎం నుంచి ఎవరైనా రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కాంగ్రెసు మద్దతు అవసరం. లేకపోతే సాధ్యం కాదు. ఏచూరిని మళ్లీ నిలబెడితే తాము మద్దతు ఇస్తామని, వేరే సీపీఎం నేతకు ఇవ్వబోమని కాంగ్రెసు నాయకత్వం చెబుతోంది. మరోసారి పోటీకి పార్టీ నిబంధన అడ్డుగా ఉంది. ఏచూరి మేధావి. బాగా మాట్లాడగలడు. అందుకే కాంగ్రెసు ఆయనకు మద్దతు ఇస్తామంటోంది. సీపీఎం నిబంధన మార్చుకుంటుందో, అవకాశం వదులుకుంటుందో చూడాలి. ఎట్టకేలకు బండారుతో చర్చలు.

మంత్రి వర్గ విస్తరణలో తన పేరును పరిశీలించ కపోవడమే కాదు, టీడీపీ అధినాయకత్వం తనను కనీస మాత్రంగా కూడా పట్టించుకోకపోవడం పట్ల గత నెల రోజులుగా అలిగి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయానికి అందరూ తలొగ్గి మెలగాలని హితవు పలికారు. మహానాడు వేదికను నిర్ణయిం చేందుకు విశాఖపట్నం వచ్చిన ఆయన పనిలో పనిగా బండారును బుజ్జగించే యత్నం చేశారు. ఈ సందర్బంగా బండారు తన మనసులోని ఆవేదనను అంతా ఆయన ముందు వెళ్లగక్కారు. సీనియర్‌ అయిన తనను పట్టించుకోవడంలేదని, మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణాలను కూడా చెప్పేందుకు అధినాయకత్వం తనను పిలవడంలేదంటే అంతకంటే అవమానం ఉంటుందా అని సూటిగా ప్రశ్నించారని సమాచారం. బండారుకు పార్టీలో సముచిత స్ధానం ఉందని, అధినాయకుడు చంద్రబాబుతో నేరుగా మాట్లాడితే సమస్య సర్దుబాటు అవుతుందని, మీ గౌరవానికి తగిన ప్రాధాన్యతను ఆయనే ఇస్తారని కళా సూచించినట్లుగా తెలుస్తోంది.

కాగా, చంద్రబాబుతో సంతృప్తికరమైన రీతితో చర్చలు జరిగితే బండారు అలక వీడుతారని, లేని పక్షంలో ఆయన తన దారిలో తాను పయనించడం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో విపక్ష నాయకుని మాదిరిగా బండారు పార్టీ తీరు తెన్నులపైన, ప్రభుత్వ కార్యక్రమాలపైన బహిరంగంగానే విమర్శలు చేయడాన్ని కూడా అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ముందస్తు ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటనను కూడా బండారు తప్పుపట్టారు. ముందస్తు అంటే మునిగిపోవడం ఖాయమని కూడా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మూడేళ్లలో ఏం చేశామని ముందస్తుకు వెళ్తామని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే, జిల్లా అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వ ఉదాశీనతపైన ఆయన విమర్శలు చేశారు. మొత్తం మీద బాబు ఏ విధంగా బండారును బుజ్జగిస్తారన్న దానిపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

Show comments