ప్రజాప్రతినిధి కావడం మేలు!

మనది ప్రజాస్వామ్య దేశం. ఎవ్వరైనా ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీయో, ఎమ్మెల్యేనో కావొచ్చు. అదృష్టం బాగుంటే, పోటీ చేసి గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కొచ్చు. అలా కాకపోయినా ప్రజాప్రతినిధిగా బోలెడు అధికారం చెలాయించవచ్చు. చేతనైతే సంపాదించుకోవచ్చు. రాజకీయ రంగమంటే అందరికీ మోజే. ఇలా మోజు పడేవారిలో ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగ విరమణ చేసిన అధికారులూ ఉంటారు. చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రతి సాధారణ ఎన్నికల్లోనూ కనబడతారు. గెలిచినవారిలో కొందరు పదవులు సంపాదించుకొని రాజకీయాల్లో నిలదొక్కుంటారు. కొందరు ఏవో కారణాల వల్ల తెరమరుగైపోతారు. సర్వీసులో ఉన్న అధికారులు, ఉద్యోగ విరమణ చేసిన అధికారులు రాజకీయాల్లోకి రావడమనేది కేవలం ఆసక్తివల్లనే కాదు. వారికి రాజకీయంగా ఉండే పలుకుబడి మీద ఆధారపడివుంటుంది. ఇలాంటివారికి రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలుంటాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున పోటీ చేయడానికి కొందరు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారట....!

ఇప్పటివరకు తెలిసన సమాచారం ప్రకారం ఓ ఐఏఎస్‌ అధికారి, మరో రాష్ట్రస్థాయి అధికారి అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఐఏఎస్‌ అధికారి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందినవాడు కాగా, మరో అధికారి మున్సిపల్‌ పరిపాలనలో పనిచేస్తున్నాడు. పంచాయతీరాజ్‌ శాఖ సీఎం కుమారుడు లోకేష్‌ది కాగా, మున్సిపల్‌ పరిపాలన విద్యా వ్యాపారి నారాయణది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్న అధికారులు విధినిర్వహణలో, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో రాజీపడుతున్నట్లు సమాచారం. అంటే నిబంధనలను పక్కకు పెట్టి అధికార పార్టీవారికి సహకరిస్తున్నారని అర్థం. మంత్రులను, ఇతర ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతుండొచ్చు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఐఏఎస్‌ అధికారి రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. అంతేకాకుండా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పోస్టింగులు ఇవ్వడంలో, బదిలీలు చేయడంలో ఈయన మాట బాగా చెల్లుబాటు అవుతోందట...! ఈయన దగ్గర డబ్బు కూడా దండిగా ఉంది. సర్వీసులోనూ ఆర్థిక ప్రయోజనాలు బాగానే ఉన్నాయట.

ఈయన కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు. రాయలసీమకు చెందిన ఈ అధికారి కుటుంబం టీడీపీకి బాగా అనుకూలం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో విధేయులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు ఇప్పిస్తామని (ఎంపీకిగాని, ఎమ్మెల్యేకుగాని) నాయకులు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈయన రిజర్వుడు కేటగిరీకి చెందినవాడు కావడంతో అవకాశం ఉందంటున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మరో అధికారి చిత్తూరు జిల్లాకు చెందినవాడు. అంటే సీఎం చంద్రబాబు నాయుడి సొంత జిల్లా అన్నమాట. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు అధికారులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే విషయం రహస్యమేమీ కాదు. ఇతర అధికారులందరికీ తెలుసు. తాము పోటీ చేయబోతున్నట్లు ఈ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి అవినీతిపరుడనే పేరుంది. అయినప్పటికీ ప్రభుత్వం అతన్ని ప్రోత్సహిస్తోందని ఇతర అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఆయన పనితీరు ఎలా ఉందనేది ఊహించుకోవచ్చంటున్నారు.

ఎన్‌టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు సాధారణ ఉద్యోగులు సైతం కొందరు రాజకీయాల్లోకొచ్చి రాణించారు. స్కూలు టీచర్లు కూడా ఎన్నికల్లో గెలిచి మంత్రులైన దాఖలాలున్నాయి. సర్వీసులో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారికి ఆర్థబలం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వారు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సివుంటుంది కాబట్టి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు 'తటస్థులు' పేరుతో కొందరు ఉద్యోగులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయించారు. అప్పట్లో ఇదో ప్రయోగం. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగాలకు రాజీనామా చేసి బరిలోకి దిగారు. ఇలాంటివారిలో పరాజితులైనవారు ఆ తరువాత రాజకీయాల్లో తెరమరుగై ఉపాధి లేక నానా పాట్లు పడ్డారు. కొందరు తమకు ఉద్యోగాలు ఇప్పించాలని బాబును ప్రాధేయపడిన సందర్భాలూ ఉన్నాయి. బాబు క్రమంగా సంపన్నులను చేరదీయడం, కార్పొరేట్లకు పెద్ద పీట వేయడంతో సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది.

-మేనా

Show comments