పొత్తుపై బాబుకే సందేహమా?

వాన రాకడ ప్రాణం పోకడ తెలియనట్లే రాజకీయాల్లో పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడు విచ్ఛిన్నమవుతాయో తెలియదు. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని జిగ్రీ దోస్తుల్లా ఉండే పార్టీల మధ్య కొంత కాలం తరువాత విభేదాలు ప్రారంభమవుతాయి. అవి విడిపోవడానికి బలమైన కారణాలే అక్కర్లేదు. అత్యంత బలహీనమైన కారణాలతోనూ విడిపోతాయి. పొత్తులు కుదరడం, విడిపోవడం కూడా ఎవ్వరి అంచనాలకు అందదు.

సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ-బీజేపీపై పొత్తుపై మీడియాలో, సామాన్య జనంలో సందేహాలు కలుగుతున్నాయి. పొత్తు కొనసాగుతుందా? పెటాకులవుతుందా? అనే ప్రశ్న కొంతకాలంగా తరచూ ఉత్పన్నమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సైతం పొత్తుపై స్థిరమైన అభిప్రాయం చెప్పడంలేదు.

ఒక్కోసారి ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. దాన్ని గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు' అని చెప్పరు. 2019 వరకైతే బీజేపీతో కలిసి ప్రయాణిస్తామన్నారు. తాను మిత్ర ధర్మం పాటిస్తున్నానని అన్నారు. బాబు చెప్పినదాన్ని బట్టి 2019 ఎన్నికల్లో పొత్తు ఉండాలా? వద్దా? అనేది మళ్లీ నిర్ణయమవుతుందన్నమాట.

అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఈమధ్యనే చంద్రబాబు 'వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తాం' అని చెప్పారు. ఇప్పుడేమో అస్పష్టంగా చెప్పారు. అంటే పొత్తులపై ఆయనకూ సందేహంగానే ఉందనుకోవాలి. రెండు పార్టీల మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లయితే అస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 

Readmore!

ఈమధ్య అమిత్‌ షా వచ్చి వెళ్లిన తరువాత  రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేశినేని నాని వంటివారు బీజేపీతో పొత్తు లేకపోయుంటే టీడీపీకీ ఎక్కువ సీట్లు వచ్చేవన్నారు. అప్పుడు చంద్రబాబు తమ్ముళ్లను మందలించి బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. పొత్తుపై ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

కొంతకాలం క్రితం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం అనవసరమన్నారు. కాని ఈ మధ్య రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. ఒక్కటి మాత్రం వాస్తవం. కమలం-సైకిల్‌ మధ్య హృదయపూర్వకమైన స్నేహం లేదు. రెండు పార్టీల్లోనూ విడిపోవడానికి చాలామంది నాయకులు సుముఖంగా ఉన్నారు. కొందరు ఆ విషయం బహిరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెసు నుంచి బీజేపీలో చేరిన నాయకులకు చంద్రబాబంటే అస్సలు పడదు.

వారంతా పొత్తు వద్దని అమిత్‌ షాను కోరుతున్నారు. రెండు పార్టీలు రాష్ట్రంలో, కేంద్రంలో కొలువైన కొంతకాలానికే మనస్పర్థలు మొదలయ్యాయి. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, అందిస్తున్న అరకొర సాయం పట్ల టీడీపీలో అసంతృప్తి ఉన్నా బాబు సర్దుకుపోతున్నారు. ఇలా సర్దుకుపోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎన్నికల సమయానికి బాబు గ్రహించినట్లయితే ఒంటరిగా పోటీ చేయడానికి వెనకాడకపోవచ్చు. బలవంతంగా కలిసున్న టీడీపీ, బీజేపీ వెయిట్‌ అండ్‌ సీ అన్న ధోరణిలో ఉన్నాయి.

టీడీపీతో పొత్తు ఉండాలా? వద్దా? అని నిర్ణయించేది కేంద్ర నాయకత్వం అయినప్పటికీ ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు కాబట్టి అక్కడి కమలం నాయకుల్లో ఈ తర్జనభర్జన లేదు. వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.అంత ధీమా ఏమిటో తెలియదు.

సరే...తెలంగాణ బీజేపీ విషయం అలా పక్కనుంచితే ఆంధ్రా బీజేపీ నేతల్లో కొందరు టీడీపీతో కలిసి పోటీ చేయాల్సిందేనని, అంతకుమించి మార్గం లేదని చెబుతుండగా, దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరిగింది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఆంధ్రాలోనూ అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించడం, ఉత్తరాఖండ్‌ను గెలుచుకోవడం, గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఏపీ బీజేపీలో అధికారంపై ఆశలు చిగురింపచేస్తున్నాయి. టీడీపీతో పొత్తు వద్దని వాదిస్తున్న నాయకులు ఏపీలో బీజేపీకి బలమైన నాయకుండుంటే యూపీ తరహా గెలుపు సాధ్యమేనని కేంద్ర నాయకత్వానికి చెబుతున్నారు.

Show comments