1961లో ‘శ్రీశైల మహాత్మే’ అనే కన్నడ సినిమా ద్వారా జయలలిత బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. పన్నెండేళ్ల వయసులో జయ తొలిసారి అలా వెండి తెరపై కనిపించారు. ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. తర్వాత మూడంటే మూడు సంవత్సరాలకే జయ హీరోయిన్ అయ్యింది. ‘చిన్నాడ గోంబే’ అనే కన్నడ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ గా జయ కెరీర్ కు ఊపు వచ్చింది.
ఆ తర్వాతి ఏడాది నుంచి దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. ఎన్నో సూపర్ హిట్లు. ఆ విధంగా పదిహేను సంవత్సరాల ప్రస్థానం. సినిమాల్లో నటించడం మానేసి, అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకునే నాటికి దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారామె.
ఎంజీఆర్ ఆహ్వానం మేరకు అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1983లో ఆ విధంగా ఆమె క్రియాశీల రాజకీయాలు మొదలయ్యాయి. 1984లో పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. స్టార్ క్యాంపెయినర్ గా పేరు తెచ్చుకున్నారు.
1987లో ఎంజీఆర్ మరణానంతర పరిణామాలతో జయ, ఆమె మద్దతుదారులు పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. ఆ తర్వాత ఇరు వర్గాల రాజీ అనంతరం శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నేత.
1991 ఎన్నికల్లో అన్నాడీఎంకేని ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ టర్మ్ పూర్తయ్యే సరికే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం. అవినీతి ఆరోపణలపై జయ అరెస్టు. తొలి సారి జైలుకు. నెల పాటు జ్యూడీషియల్ కస్టడీలో.
2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం. అయితే కేసుల కారణంగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయారు. అయిననూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది చెల్లదని కోర్టు తీర్పు.. పన్నీరు సెల్వంకు బాధ్యతలు అప్పగించారు. కొంతకాలంలోనే కొన్ని కేసుల కొట్టివేత.. తిరిగి సీఎం పదవిని అధిష్టించారు.
2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి. 2011లో తిరిగి విజయపథాన. మళ్లీ తమిళనాడు సీఎంగా బాధ్యతలు. అయిననూ వదలని ఆస్తుల కేసు. ఆమెను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు. సీఎం పదవికి రాజీనామా. జైలుకు వెళ్లారు. వంద కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష.
జయను నిర్దోషిగా ప్రకటించిన పై కోర్టు. శిక్ష, జరిమానా రద్దు. అంతలోనే 2016 అసెంబ్లీ ఎన్నికలు. జయ పార్టీ విజయదుందుభి. వరసగా రెండో సారి సీఎంగా బాధ్యతలు. ఎంజీఆర్ తర్వాత ఆ ఫీట్ జయదే.
సంచలన విజయానంతరం ఐదు నెలల కిందట సీఎం పదవిని చేపట్టిన జయ ఇంతలోనే అనారోగ్యం పాలయ్యారు. 70 రోజుల పాటు మృత్యవుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.