రాజకీయాల్లో సినిమాటిక్‌ 'డ్రామా'.!

'నన్ను చంపేందుకు ప్రయత్నించు.. కానీ, నేను చచ్చిపోకూడదు. డీల్‌ పక్కా.. అడ్వాన్స్‌ కాదు, ఫైనల్‌ పేమెంట్‌ ఒకేసారి..' 

- మహేష్‌బాబు హీరోగా నటించిన 'అతడు' సినిమాలోనిది ఈ సీన్‌. ముఖ్యమంత్రి పదవి కోసం 'హత్యాయత్నం' డ్రామా ప్లే చేస్తాడు, అందులో ఓ పొలిటికల్‌ లీడర్‌. అఫ్‌కోర్స్‌, డీల్‌ ఇంకోరకంగా మారి.. ఆ రాజకీయ నాయకుడు మర్డరైపోతాడనుకోండి.. అది వేరే విషయం. 

సినిమాలోనే, కేసు విచారించే ఓ పోలీస్‌ అధికారి (ప్రకాష్‌రాజ్‌), డ్రమెటిక్‌ హత్యాయత్నానికి 2 కోట్ల దాకా డీల్‌ జరుగుతుందని తెలుసుకున్నాక, 'ఉద్యోగాలు చేసి ఏం సాధిస్తాం.? ఎంచక్కా ఇలాంటి డీల్స్‌ చేసుకుంటే బెటరేమో..' అంటాడు. హత్యకైతే పెద్దగా ఖర్చు చేయక్కర్లేదు, మర్డర్‌ అటెంప్ట్‌ జరగాలి, కానీ తుపాకీ నుంచి వచ్చే 'బుల్లెట్‌' ప్రాణాలు తియ్యకూడదంటే ఖర్చవుతోంది.. అదీ కోట్లలో.! అది సినిమా. ఆ సినిమాని చూసి, ఇన్‌స్పయిర్‌ అయినట్టున్నాడో యంగ్‌ పొలిటీషియన్‌. 

ఆ యంగ్‌ పొలిటీషియన్‌ ఎవరో కాదు, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌. సినిమా పరిశ్రమలో మనోడికి సన్నిహిత సంబంధాలున్నాయి. తెరవెనుక సినిమాలకి 'ఆర్థిక సహాయం' కూడా అందిస్తాడట. పబ్బులు నడిపిన అనుభవమూ వుంది. ఇకనేం, సినిమాటిక్‌గా ఓ డ్రామాకి తెరలేపాడు. పైన చెప్పుకున్నాం కదా, 'అతడు' సినిమా టైప్‌లో సీన్‌ని సృష్టించాలనుకున్నాడు. కానీ, ఇక్కడ దొరికేశాడు. 

'ఎవరో వచ్చారు, కాల్పులు జరిపారు.. నా మీద హత్యాయత్నం జరిగింది..' అంటూ విక్రమ్‌ పోలీసులకు తొలుత చెప్పాడు. అదీ తీవ్రగాయాలతో, ఆసుపత్రి పాలయ్యాక. కానీ, పోలీసులకు అనుమానమొచ్చింది. తీగ లాగితే మొత్తం డొంక కదిలిపోయింది. విక్రమ్‌ స్క్రీన్‌ప్లే వెలుగు చూసింది. దారుణం అనాలో, ఇంకేమన్నా అనాలో.. రాజకీయ అవసరం మనిషి ఎంతకైనా తెగించేలా చేస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

2019 ఎన్నికల్లో టిక్కెట్‌ సాధించి, ఇప్పుడు లభించే సానుభూతితో అప్పుడు గెలిచేయాలనేది ఓ ప్లాన్‌. దాంతోపాటుగా, అప్పులిచ్చినోళ్ళ నుంచి తప్పించుకోడానికీ ఈ 'డ్రామా' ఉపయోగపడ్తుందనుకున్నాడు విక్రమ్‌. ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నాడు, డిశ్చార్జ్‌ అయ్యాక జైలుకెళ్తాడు. సినిమా చూశాడు, స్కెచ్‌ వేశాడు.. కానీ, దొరికిపోతే ఏంటి సంగతి.? ఆని ఆలోచించుకోలేకపోయాడు. 

సినిమాలు చూసి జనం పాడైపోతున్నారహో.. అని నెత్తీనోరూ బాదుకునేటోళ్ళకి ఈ వ్యవహారం భలేగా పనికొస్తుంది. కానీ, 'అతడు' సినిమా ఎప్పుడొచ్చింది.? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా.? లేదా.? అదే ముఖ్యం అంటాడు మహేష్‌ 'పోకిరి' సినిమాలో. ఆ సినిమాలోని సీన్‌, ఇదిగో ఇప్పుడు ఫ్రెష్‌గా ఇలా అమలు చేశారంటే.. ఆ సీన్‌ తాలూకు ఇంపాక్ట్‌ అలాంటిదని సరిపెట్టుకోవాలేమో.!

కొసమెరుపు: విక్రమ్ గౌడ్ ‘అతడు’ సినిమా మొత్తం చూసి వుండడు.. చూసి వుంటే, ఇంత సిల్లీగా ప్లాన్ చేసి బుక్ అయిపోయి వుండేవాడు కాదు.

Show comments