రజనీకాంత్‌కి 'తమిళ' దెబ్బ.!

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి, తమిళ సంఘాలు ఝలక్‌ ఇచ్చాయి. శ్రీలంకలో పర్యటించాలనుకున్న రజనీకాంత్‌కి తమిళ సంఘాలు అల్టిమేటం జారీ చేయడంతో, చేసేది లేక ఆయన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగి వుంటే, ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో రజనీకాంత్‌ శ్రీలంకలో పర్యటించడం, అక్కడాయనకు ఘన స్వాగతం లభించడం.. అక్కడి రాజకీయ ప్రముఖులతో మంతనాలు.. ఇలా పెద్ద కథే నడిచేది. 

అయితే, శ్రీలంకలో తమిళుల్ని అణచివేయడంలో అప్పట్లో రాజపక్సే ప్రభుత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం పట్ల ఇప్పటికీ తమిళనాడులో ఆగ్రహం తగ్గలేదు. రాజపక్సే కుటుంబ సభ్యులతో 'లైకా' సంస్థకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ లైకా సంస్థ తమిళనాడులో 150 ఇళ్ళను నిర్మించింది. ఆ ఇళ్ళను ప్రారంభించేందుకు రజనీకాంత్‌ వెళ్ళాలనుకోవడమే అసలు వివాదం. అయితే, 'రోబో 2.0' సినిమా విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయని తమిళ సంఘాలు, ఇప్పుడిలా రజనీకాంత్‌పై గుస్సా అవడమేంటన్నది 'లైకా' సంస్థ ప్రశ్న. ఏమో, ముందు ముందు ‘2.0’ సినిమాకీ వివాదాలు తప్పవేమో.

సెంటిమెంట్లు అంతే.. ఒక్కోసారి ఒక్కోలా వుంటాయి. సెంటిమెంట్‌ రాజుకున్నాక ఎలాంటోళ్ళయినాసరే తలొగ్గాల్సిందే. ఆ విషయం రజనీకాంత్‌కి బాగా తెలుసు. అందుకే, ఇంకో ఆలోచన లేకుండా శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారాయన. కానీ, 'లైకా' సంస్థ మాత్రం, శ్రీలంకలో రజనీకాంత్‌ టూర్‌ రద్దు కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అక్కడ తాము చేసుకున్న ఏర్పాట్లన్నీ వ్యర్థమయ్యాయని ఆ సంస్థ ప్రతినిథులు వాపోతున్నారు.

Show comments