'నేను వార్నింగ్ ఇస్తున్నా..' అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అసెంబ్లీ అంటే అది తన జాగీరు ఏమాత్రం కాదన్న విషయాన్ని ఆయన మర్చిపోతే ఎలా.? చట్ట సభల్లో పాలక - ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం మామూలే. ఇదేదో కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే జరుగుతోందనీ, అది కూడా ఇప్పుడే కొత్తగా జరుగుతోందనీ చంద్రబాబు అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
చంద్రబాబు, ఒకప్పుడు తాను ప్రతిపక్ష నేతగా వున్న రోజుల్ని గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీలో నిద్ర చేయడం, అప్పటి అధికారపక్షంపై విరుచుకుపడ్డం.. ఇవన్నీ గుర్తు చేసుకుంటే, ఇప్పుడసలాయనకు నోట మాట రాదు. కానీ, గతాన్ని ఆయన మర్చిపోయారు. ఎంతైనా అపర గజినీ కదా. అందుకే అసెంబ్లీలో 'పద్ధతుల' గురించి మాట్లాడేస్తున్నారాయన.
ప్రతిపక్షం హుందాగా వుండాలని చెప్పడం వరకూ చంద్రబాబుకి హక్కు వుంది. అదే సమయంలో సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనపైనా వుంది. కానీ, హెచ్చరికలు జారీ చేయడమేంటి.? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కావొచ్చుగాక. సభా నాయకుడు అయితే కావొచ్చుగాక. అయినంతమాత్రాన, ప్రతిపక్షాన్ని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడం ఆయన స్థాయికి తగదు. ముఖ్యమంత్రి అనే పదవి తాలూకు స్థాయిని దిగజార్చేస్తున్నారు చంద్రబాబు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కూడా మార్షల్స్‌ని పెట్టాలన్నది చంద్రబాబు తాజా ప్రతిపాదన. ఇది ఇంకా హాస్యాస్పదం.
అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నప్పుడు, ఆ ప్రతిపక్షం మీడియా పాయింట్‌ని వేదికగా చేసుకుని తమ వాయిస్‌ని విన్పించడం మామూలే. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు మీడియా పాయింట్‌ని ఎలా ఉపయోగించుకుందో చంద్రబాబుకి తెలియదని ఎలా అనుకోగలం.? అంతెందుకు, తెలంగాణ అసెంబ్లీలో, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ చేస్తున్న యాగీ చంద్రబాబుకి కన్పిస్తుందా.? లేదా.?
వైఎస్సార్సీపీ చాలా కాలంగా ఓ ఆరోపణ చేస్తోంది అమరావతికి సంబంధించి. 'అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు.. అది చంద్రబాబు ప్రైవేటు రాజధాని..' అని. ఇప్పుడదే నిజమన్పిస్తోంది. వెలగపూడిలో గొప్పగా నిర్మించేశామని చంద్రబాబు చెప్పుకుంటున్న అసెంబ్లీలో, ఆయనగారు ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వార్నింగ్‌లు ఇవ్వడం, మీడియా పాయింట్ వద్ద కూడా మార్షల్స్‌ని పెడ్తామనడం.. ఇది రాజకీయ వైపరీత్యం కాక మరేమిటి.?