హత్య మానవత్వమా.? శిక్ష రాక్షసత్వమా.?

''సమాజానికి ఏదో సందేశమిద్దామనే ఉద్దేశ్యంతో ఉరిశిక్షలు విధించడం సబబు కాదు.. ఈ తీర్పు మహాత్ముడు ప్రబోధించిన అహింసా సిద్ధాంతానికి విరుద్ధం.. ఈ తీర్పుతో మానవ హక్కులు హత్యకు గురయ్యాయి..'' 

- ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో ఆరు క్రూర మృగాల దాడికి బలైపోయిన జ్యోతిసింగ్‌ ఘటనలో సుప్రీంకోర్టు, ఆ క్రూర మృగాలకి మరణ శిక్షను సమర్థిస్తే, దాన్ని ప్రశ్నిస్తూ డిఫెన్స్‌ లాయర్‌ చేసిన వ్యాఖ్యల సారాంశమిది. 

ఓ యువతిని ఆరు మానవ మృగాలు అత్యంత కిరాతకంగా హతమార్చడమే మానవత్వమని డిఫెన్స్‌ లాయర్‌ ఎ.పి. సింగ్‌కి ఏ న్యాయశాస్త్రం చెప్పిందో ఏమో.! సుప్రీంకోర్టులో మరోమారు అప్పీల్‌ చేస్తామని ఆయన చెప్పడాన్ని తప్పు పట్టలేం. ఏ కేసులో అయినాసరే, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మన న్యాయవ్యవస్థ చివరివరకూ అవకాశమిస్తుంది. కరడుగట్టిన తీవ్రవాది కసబ్‌కే అన్ని అవకాశాలిచ్చినప్పుడు, మానవ మృగాలకి మాత్రం ఎందుకు ఇవ్వం.? అదే మన న్యాయవ్యవస్థ గొప్పతనం. 

సర్వోన్నత న్యాయస్థానమే, 'ఇది అత్యంత కిరాతకమైన నేరం. నిందితులకి ఈ శిక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించలేం. అన్ని కేసుల్లోకీ ఇది అత్యంత ప్రత్యేకమైనది..' అని వ్యాఖ్యానించాక, న్యాయస్థానం ఖరారు చేసిన శిక్ష విషయంలో, 'మానవత్వం..' అంటూ కొత్త చెత్త మాటల్ని తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సబబు.? మానవత్వమంటే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమా.? అత్యంత పాశవికంగా వారిని హత్యచేయడమా.? 

'మా అమ్మాయి పేరు నిర్భయ కాదు.. ఆమె నేరం చేయలేదు. ఆమె పేరు జ్యోతిసింగ్‌. ఆమె బాధితురాలు. ఆమె పేరు ప్రపంచానికి తెలియాలి.. ఆమెను హతమార్చిన మృగాలకు శిక్ష పడాలి. మరణ శిక్ష పడితీరాల్సిందే..' అంటూ జ్యోతిసింగ్‌ తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి కంటతడిపెడుతున్నారు. ఈ కేసులో మానవ మృగాలు ఇంకా జీవిస్తుండడమే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. పైగా, ఇలాంటి కేసుల్లో దోషుల తరఫున మానవీయ కోణంలో చూడాలన్న ఆలోచనే అత్యంత రాక్షసత్వం.

Show comments