ఆ ఒక్కటీ అడక్కూడదంతే.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని అసెంబ్లీ, శాసనమండలి భవనాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రికార్డు సమయంలో ఈ ప్రాంగణం రూపుదిద్దుకోవడాన్ని అభినందించి తీరాల్సిందే. అత్యాధునిక హంగుల్ని అసెంబ్లీ, శాసనమండలి కోసం ఏర్పాటు చేయడాన్నీ అభినందించకుండా వుండలేం. 

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తొలి నిర్మాణం తాత్కాలిక సచివాలయ ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో ఇప్పటికే సచివాలయం అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. ఇదే ప్రాంగణంలో అసెంబ్లీ, శాసనమండలిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పదేళ్ళపాటు హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధానిగా వుండనున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని - ఆత్మగౌరవం నినాదంతో సొంత రాష్ట్రం వైపు వడివడిగా అడుగులు పడ్డాయి. అఫ్‌కోర్స్‌, ఓటుకు నోటు కేసు తెరపైకి రాకపోయి వుంటే, అమరావతి వైపు చంద్రబాబు అడుగులు వేసేవారు కాదన్నది నిర్వివాదాంశం. అది వేరే టాపిక్‌. 

కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ.. సొంత గడ్డ మీద నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాల్ని నిర్వహించనుండడం తన అదృష్టమని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాసనసభ, మండలిలను నిర్మించామని చెబుతున్న కోడెల, శాసనసభ్యులకు వసతి సహా అన్ని ఏర్పాట్లూ చేశామనీ, సమస్యలేమీ లేకుండా చూస్తున్నామనీ చెప్పుకొచ్చారు.

'హైద్రాబాద్‌ అసెంబ్లీకీ, ఇక్కడి అసెంబ్లీకీ తేడా ఏంటి.?' అనడిగితే, అది పరాయి రాష్ట్రంలోని మన అసెంబ్లీ, ఇది మన రాష్ట్రంలోని మన అసెంబ్లీ.. అంటూ నవ్వేశారు కోడెల. అంతా బాగానే వుందిగానీ, కొత్త రాష్ట్ర అసెంబ్లీలో అయినా, పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం కాకుండా, సభ సజావుగా జరుగుతుందా.? అన్న ప్రశ్నకు మాత్రం కోడెల నుంచి సమాధానం రావడంలేదు. పార్టీ ఫిరాయింపుల సంగతేంటి.? అన్న ప్రశ్నే తనకు ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నారాయన. 

ఇదిలా వుంటే, చిన్న కార్యక్రమానికైనా కేంద్ర మంత్రుల్ని పిలిపించి హడావిడి చేసే చంద్రబాబు, అసెంబ్లీ - మండలి భవనాల ప్రారంబోత్సవానికి కేంద్రం నుంచి ముఖ్యులెవర్నీ పిలిపించకపోవడానికి కారణమేంటట.? ప్రధాని వస్తారనీ, లోక్‌సభ స్పీకర్‌ని ఆహ్వానిస్తామనీ గతంలో చెప్పిన చంద్రబాబు సర్కార్‌, ఆ విషయంలో ఇప్పుడెందుకు నోరు మెదపడంలేదట.? ఏమో మరి, ఆయనకే తెలిఆలి. 

రాజధానికి సంబంధించి తొలి నిర్మాణంగా సచివాలయ ప్రాంగణం గురించి చెప్పుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్‌ ఆస్తి. అలాంటప్పుడు, విపక్షాల్ని సైతం  ప్రత్యేకంగా ఆహ్వానించాల్సింది పోయి.. అక్కడికేదో తమ సొంత కార్యక్రమం అన్నట్లు చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తుండడం ఆక్షేపణీయమే.

Show comments