ఒక వంచన- దానికి ముసుగు ఆత్మవంచన!

నవతరం రాజకీయాలు సరికొత్త జీవన సిద్ధాంతాలను నేర్పుతున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని, అనుష్ఠాన జీవన విధానాన్ని కాపాడే లక్ష్యాలు కూడా తమ ఎజెండాలో పొందుపరచుకుని.. అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు సరికొత్త జీవన సిద్ధాంతాలను తయారుచేసి.. తమ వ్యకిత్వ గుణ విశేషాలతో వాటికి వన్నెలద్ది ప్రజలకు వాటిని అలవాటు చేస్తున్నారు. అవును. అలాంటివేవో తెలుసుకుందాం. 

ఫరెగ్జాంపుల్‌.. మీరు ఎవరినైనా మోసం చేసారనుకోండి. ఎవరి తోనైనా మాటతప్పి లేకి గా వ్యవహరించారనుకోండి. పైకి ఎలా వ్యవహరించినా మీ లోలోపల అపరాధభావం ఉంటుంది. మీకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. లోలోపల మధన పడుతూ ఉంటారు. మన వల్ల మోసగింపబడిన వ్యక్తి కనిపిస్తేనే కుంచించుకుపోతూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే పద్ధతి. అయితే ఎవరిని ఎలా మోసం చేసినా.. దాన్ని ఎలా మాయచేయవచ్చునో ఇప్పుడు భాజపా నాయకులు కొత్త జీవన శైలీ సిద్ధాంతాలను నేర్పుతున్నారు. 

ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను మోదీ సహా కేంద్రంలోని భాజపా మొత్తం టోకుగా వంచించింది అనడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. సహజంగానే ప్రజలంతా వారిని తిట్టుకుంటున్నారు. వారంటే బాధ పడుతున్నారు. ఆవేదన చెందుతున్నారు. అయితే దీనికి విరుగుడు ఏమిటి? భాజపా నాయకులు ఏపీ జనంలోని తమ తైనాతీలతో విపరీతంగా పొగిడించుకుంటున్నారు. తెదేపా ఎటూ వారి తొత్తుగా పనిచేస్తున్నది గనుక.. వారు పొగడ్డంలో ఆశ్చర్యం లేదు. ఇతరత్రా పార్టీ శ్రేణులతో తమను విపరీతంగా పొగిడించుకుంటూ.. ఏపీకి తాముమేలుచేసినట్లుగా.. చేయబోయే మాయను ప్రజలు నమ్మేలా భ్రమింపజేయాలనుకుంటున్నారు. 

వెంకయ్యనాయుడు విషయానికే వస్తే.. తన అసమర్థత కావచ్చు.. లేదా తన నిస్సహాయత కావొచ్చు.. కేంద్రంలో మాట నెగ్గించుకురాలేని.. తన దయనీయ స్థితి కావొచ్చు.. మొత్తానికి తన ద్వారా రాష్ట్రానికి వంచన జరిగిందని ఆయనకు బాగా తెలుసు. అయితే ప్రజలను ఇంకా భ్రమల్లో ముంచడానికి మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. గొప్ప ప్యాకేజీ తీసుకువచ్చిన మహానేతగా ఆయన పొగిడించుకుంటున్నారు. ఇవాళ ఆయనకు విజయవాడలో ఓ సన్మాన కార్యక్రమం కూడా జరగబోతోంది. 

అంటే అసలే జరిగింది వంచన.. దాన్ని కవర్‌ చేసుకోవడానికి భాజపా నాయకులు సరికొత్త ఆత్మవంచనతో ప్రొసీడ్‌ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. వంచనకు ముసుగుగా ఆత్మవంచనను వాడుకునే తరహా వెరైటీ అయిడియాలు రాజకీయ నాయకులకు మాత్రమే వస్తాయేమోనని జనం అనుకుంటున్నారు. ఇలాంటి సరికొత్త జీవన విలువల్ని జనం కూడా నేర్చుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. 

Show comments