స్మార్ట్‌ తిరుపతి.. ఇది కూడా ప్యాకేజీనే.!

అంతన్నాడింతన్నాడే వెంకయ్య.. ప్రత్యేక హోదా అన్నాడే వెంకయ్య.. ప్రత్యేక ప్యాకేజీ అన్నాడే వెంకయ్య.. తుస్సుమనిపించాడే వెంకయ్య.. ప్రత్యేక సాయం అంటున్నాడే వెంకయ్య.. అని జనం ఆవేదనతో నిట్టూర్చాల్సి వచ్చింది. అప్పుడేమో ప్రత్యేక హోదా కోసం ఎడ్యుకేట్‌ చేశారు.. ఇప్పుడేమో అదే ప్రత్యేక హోదా వేస్ట్‌, ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్‌.. అంటూ పాఠాలు చెబుతున్నారు. వెంకయ్య అంతే, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కాలగర్భంలో కలిపేసి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేస్తున్నారు. 

ఇక, అసలు విషయానికొస్తే వెంకయ్యనాయుడుగారు దయతో, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరాన్ని స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చారు. మొత్తం 27 నగరాల్ని స్మార్ట్‌ సిటీ పధకంలోకి ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించిన వెంకయ్య, అందులో తిరుపతి నగరం కూడా వుందని వెల్లడించారండోయ్‌. స్మార్ట్‌ సిటీ తిరుపతి.. ఇది కూడా ప్యాకేజీలోనిదే.. అని చెప్పాలనుకున్నా, వెంకయ్య కాస్త సంశయించి వుంటారు. ఎందుకంటే, రేప్పొద్దున్న తిరుపతికో, ఆంధ్రప్రదేశ్‌లోని ఇంకో చోటకో వెళ్ళి, భారీ బహిరంగ సభలో ఆ 'సినిమా కథ' చెప్పొద్దూ.! 

కేంద్రం నుంచి ఏ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి రూపాయి వచ్చే అవకాశమున్నా, దాన్ని వెంకయ్య ప్యాకేజీ కోటాలో పడేస్తున్నారు. అవును మరి, ఆయన ఏకంగా రెండు లక్షల పాతిక వేల కోట్ల ప్యాకేజీ లెక్క తేల్చారు కదా. ఆ లెక్క క్లియర్‌గా వుండాలంటే ఆ మాత్రం పాట్లు తప్పనిసరి. ఇప్పటికే విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌కి ఎంపికైంది. కాకినాడ కూడా అంతే. కానీ, ఈ రెండు నగరాల్లో స్మార్ట్‌గా ఏదీ మారింది లేదు. ఆయా నగరాల్లో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. 

స్మార్ట్‌ సిటీ అంటే 'పాడిందే పాటరా.. డాష్‌ డాష్‌ డాష్‌' అన్నట్లు వుండదు కదా. దానికో పెద్ద కథ వుంటుంది. బోల్డంత కృషి చేయాలి. కేంద్రం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చించాలి. విదేశాల్లోనే స్మార్ట్‌ సిటీ అంటే కనా కష్టమైపోతోంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు చేపట్టడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తాయి. కానీ, అలవోకగా వెంకయ్యనాయుడు నోట స్మార్ట్‌ సిటీ మాటలొచ్చేస్తాయ్‌. ఎందుకు రావూ.? అవి ఉత్త మాటలే కదా.. ప్రత్యేక హోదాలాగా.!

Show comments