ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీ విజయాన్ని సెమీఫైనల్ లో విజయంగా అభివర్ణిస్తున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు. మరి ఎన్నికలకు ముందు వీరెవరూ ఈ మాట చెప్పలేదు... విజయం సాధించిన తర్వాత జరిగినవి సెమీ ఫైనల్స్ అని అంటున్నారు. ఎన్నికల ముందే ఈ మాట చెప్పి ఉంటే, అదో కథ. అనూహ్యంగా అద్భుత విజయం సాధించేసరికి.. జరిగిపోయిన మ్యాచ్ ను సెమిస్ గా పరిగణించాలని అంటున్నారు.
ఇక వచ్చే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను ఇలాంటి వాళ్లు సహజంగానే ఫైనల్స్ అని అంటున్నారు, సెమిస్ లో సత్తా చాటాం కాబట్టి ఫైనల్స్ తమదే విజయం అంటున్నారు. విశేషం ఏమిటంటే... ఇలా మాట్లాడే వారు కొత్తగా ఏమీ పుట్టుకురాలేదు. యూపీ అసెంబ్లీలో గెలిచేశాం.. వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అనే వాళ్లు కొత్త కాదు. మళ్లీ దేశాన్ని ఏలే అవకాశం మాదే అనే వాళ్లు ఇంతకు ముందు కూడా ఉన్నారు. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
2007లో యూపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి సంచలన విజయం సాధించింది. అత్యంత అనూహ్యంగా మాయ ఆధ్వర్యంలోని బీఎస్పీ అక్కడ జెండా పాతింది. ఒకసారి నాటి వ్యవహారాలను గుర్తు చేస్తే.. మాయవతి విజయం వార్తలను రాసిన మీడియా.. మాయవతి తదుపరి లక్ష్యం ప్రధాని పీఠమే అని రాసింది. యూపీలో సంచలన విజయం సాధించిన మాయవతి 2009 లోక్ సభ ఎన్నికల మీద కన్నేసిందని... యూపీలో సమకూరే బలంతో పాటు, జాతీయ స్థాయిలో తన పార్టీని బరిలో దించి.. మూడో కూటమినో, నాలుగో కూటమినో పట్టుకుని ప్రధాని అయ్యే ప్రయత్నం చేస్తుందని నాడు మీడియా ప్రత్యేక వ్యాసాలు రాసింది. మాయవతి కూడా అప్పటికి అదే ఉద్దేశంతోనే కనిపించింది. మరి 2009 నాటికి ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అక్కడ కట్ చేసి 2012 నాటికి వస్తే.. ఆ ఎన్నికల్లో మాయవతి పార్టీ ఓటమి పాలు అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సమాజ్ వాదీ పార్టీ సంచలనాన్ని కూడా ఎవ్వరూ అంచనా వేయలేదు. అవి జరిగే సరికి ములాయంను ఆకాశానికి ఎత్తింది మీడియా. ములాయం తదుపరి లక్ష్యం ప్రధాని పీఠమే అనేశారు. అందుకు తగ్గట్టుగా ములాయం కూడా సీఎం పీఠాన్ని తనయుడికి అప్పగించి ప్రధాని కావడానికి ప్రయత్నించాడు. మరి 2014లో ఏం జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు.
యూపీలో ఎవరో ఒకరు సంచలన విజయం సాధించడం.. అదే ఊపునే లోక్ సభ ఎన్నికల్లోనూ సాగిస్తామని వారు అనేయడం.. తీరా ఆ సమయం వచ్చినప్పుడు బోల్తా పడటం.. ఇదేమీ కొత్త కాదు. గత రెండు పర్యాయాలుగా జరిగింది. మరి ఇప్పుడు మూడో పార్టీ వంతు వచ్చింది. 2007లో బీఎస్పీ నుంచి 2012లో సమాజ్ వాదీ నుంచి ఎలాంటి డైలాగులు వినిపించాయో.. ఇప్పుడు బీజేపీ నుంచి అవే డైలాగులు వినిపిస్తున్నాయి. మరి యూపీ విజయం ఒక నీటి బుడగ కాదుకదా?