'బాబు'కి బాధ్యతలెక్కువైపోతున్నాయ్‌

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. పరిపాలనా బాధ్యతల సంగతి కాదిక్కడ మేటర్‌. పార్టీకి సంబంధించిన వ్యవహారాలివి. మొన్నీమధ్యనే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా 'దత్తత' తీసుకున్నారు చంద్రబాబు. భూమా కుటుంబ సభ్యుల బాధ్యత తనదంటూ అప్పట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా, దేవినేని నెహ్రూ హఠాన్మరణంతో, ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌ బాధ్యత తనదేనని ప్రకటించేశారు చంద్రబాబు. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, కాంగ్రెస్‌లో కొనసాగలేక దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీ తలుపు తట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన దేవినేని నెహ్రూ, స్వర్గీయ ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాక, చంద్రబాబుకి విరోధిగా మారిపోయారు. అప్పటినుంచి, తిరిగి టీడీపీలో చేరేదాకా దేవినేని నెహ్రూ, చంద్రబాబుకి రాజకీయంగా శతృవులానే వ్యవహరించారు. కారణాలేవైతేనేం, టీడీపీ నేతగానే దేవినేని నెహ్రూ తుది శ్వాస విడిచారు. 

ఇంతకీ, దేవినేని అవినాష్‌ సంగతేంటి.? కాంగ్రెస్‌ పార్టీలో వున్నప్పుడే, విజయవాడకు సంబంధించి యూత్‌ వింగ్‌ కీలక బాధ్యతలు దేవినేని నెహ్రూ, అవినాష్‌కి అప్పగించేసుకున్నారు. అలా చెప్పుకోదగ్గ పదవిలోనే కన్పించిన దేవినేని అవినాష్‌, సమైక్య ఉద్యమం, ప్రత్యేక హోదా నినాదాలతో కాస్తంత గట్టిగానే హడావిడి చేశారు కూడా. టీడీపీలోకి వెళ్ళాకే, అవినాష్‌ 'ఖేల్‌ ఖతం' అయిపోయింది. ఇప్పుడు తీరిగ్గా చంద్రబాబు, అవినాష్‌ బాధ్యత తనదేనంటున్నారు. చిత్రంగా చంద్రబాబు పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్‌ కూడా, అవినాష్‌ తనకు మంచి స్నేహితుడని చెబుతున్నారు. నమ్మొచ్చా.? 

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి, ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ని వాడుకుని హ్యాండిచ్చేసిన చంద్రబాబుకి, ఈ 'బాధ్యతల' మాటలు గుర్తుంటాయా.? గుర్తుండవు గనకనే, బాధ్యతలు పెంచేసుకుంటున్నారు. మాటలే కదా, ఎన్నయినా చెప్పేసుకోవచ్చు. దటీజ్‌ చంద్రబాబు. 

Show comments