ఔను.. అదే ముఖ్యమిప్పుడు

హైకోర్టు విభజన విషయంలో తొందరేమీ లేదు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రైల్వే జోన్‌ పెద్ద ఇంపార్టెంట్‌ ఇష్యూ కాదు.. పార్టీ ఫిరాయింపు అంశమూ అంత సీరియస్‌ కానే కాదు.. కానీ, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అతి ముఖ్యం.! ఔను, ఆ దిశగా కేంద్రం కసరత్తులు మొదలు పెట్టేసింది. తప్పదు మరి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఆ స్థాయిలో ఒత్తిడి తెచ్చేస్తున్నారట.! 

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పెటోడు మహా మేధావి.. అన్నట్టుందిప్పుడు వ్యవహారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంశం ఇప్పట్లో సాధ్యం కాదనీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నియోజకవర్గాల్ని పెంచాల్సి వస్తే ఆర్టికల్‌ 170(3)ని సవరించాల్సి వుంటుందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా సెలవిచ్చారు. దీనిపై వెంకయ్యనాయుడు, చాలా వేగంగా స్పందించేశారు. కేంద్ర హోం మంత్రితో కూడా మాట్లాడేశారట. ఎంత స్పీడో కదా.?

మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, నియోజకవర్గాల పెంపుకి సంబంధించి అవసరమైన సవరణల కోసం క్యాబినెట్‌ నోట్‌ తయారవుతోందనీ సెలవిచ్చారు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడాయనే 'పెద్దన్న' మరి.! ఈ పెద్దన్న, పనికొచ్చే విషయాల్లో మాత్రం తన పెద్దరికం చూపించరు. ఎక్కడ పబ్లిసిటీ దొరుకుతుందో చూసుకుని, ఆయా అంశాల చుట్టూ వాలిపోతారంతే.! 

పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని సృష్టించిందే వెంకయ్యనాయుడు.. ఆయనే, ఆ అంశాన్ని పాతాళంలోకి తొక్కేశారనుకోండి.. అది వేరే విషయం. అయినా, ఆయన పెద్ద మనిషే. హైకోర్టు విభజనపై తెలంగాణ నుంచి పలుమార్లు విజ్ఞప్తులందుకున్నా, వెంకయ్య ఆ విషయంలో కలగజేసుకోలేదు. కానీ, నియోజకవర్గాల పెంపు బాధ్యత తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు వెంకయ్యనాయుడు. నమ్మేవాడుంటే, వెంకయ్య ఏమైనా చేస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Show comments