అబ్బో.. ఒంటరి పోటీనంట.. ఇచ్చిన సీట్లలో చేయండి చాలు!

మామూలే..కమలనాథులు ఇలాంటి కబుర్లు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. తెలుగుదేశంతో తెగదెంపులు చేసేసుకుంటాం అని అంటూ ఉంటారు. కొంతమంది వీర బీజేపీ వాదులు.. ఇలాంటి మాటలతో ఉద్రేక పడుతూ ఉంటారు. అవును.. పొడిచేస్తాం.. చించేస్తాం.. అని వీరు ఆ ఆవేశంలో రెచ్చిపోతూ ఉంటారు. అయితే అసలు కథ “నాయుళ్ల” గేమ్ మొదలుపెట్టకముందే!

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయాలా.. వేరుపడి పోటీ చేయాలా.. అని డిసైడ్ చేసేది ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లెవరైనా అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదు కదా! బీజేపీతో పోటీ చేస్తే తమకు లాభమా.. నష్టమా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం అధినేత అది డిసైడ్ చేస్తాడు. దానికి అనుగుణంగా తందాన అనడం తప్ప కమలం పార్టీకి అంతకు మించిన సీన్ లేదు.

వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసేస్తాం అని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ప్రకటించారు. ఆయన హోదాను బట్టి చూస్తే.. ఇది చాలా పెద్ద ప్రకటనే. అయితే.. ఏపీలో బీజేపీకి చరిత్రను గమనిస్తే మాత్రం.. ఇదంత సీరియస్ గా తీసుకోవాల్సిన వ్యవహారం ఏమీ కాదు. 

అయినా కమలం పార్టీ ఏపీలో సొంతంగా పోటీ చేసే సంగతెలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విదిల్చే సీట్లలో బీజేపీ పోటీ చేయగలిగితే అదే పెద్ద విజయం. బాబు పది సీట్లు ఇస్తాడు.. అందులో ఆరు సీట్లలో తెలుగుదేశం బీఫారమ్ మీద తమ్ముళ్లను బరిలోకి నిలుపుతాడు. అయినా బీజేపీ కుక్కిన పేనులా ఉంటుంది. ఇక బీజేపీ ముసుగులు వేసుకున్న ఒక సామాజికవర్గపు నేతలు బాబుగారి కాళ్లు పట్టడంలో బిజీగా ఉంటారు. ఇదంతా ఎవరికి తెలియని కథ… అలాంటి దాంట్లో ఒంటరి పోరు కామెడీలెందుకో!

Show comments