క్షమాపణ చెప్పినా.. సత్యరాజ్ మగాడ్రా బుజ్జీ..

తన ఒక్కడి కారణంగా 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాకి ఇబ్బందులు రాకూడదనే 'కట్టప్ప' సత్యరాజ్‌ క్షమాపణ చెప్పాడు. కన్నడిగులకు సత్యరాజ్‌ క్షమాపణ చెప్పిన వ్యవహారానికి సంబంధించి 'కథ' చాలానే వుంది. ఉత్త క్షమాపణ చెప్పేసి ఊరుకోలేదు. ఇకపై సినిమా అవకాశాలు రాకపోయినా తనకు నష్టమేమీ లేదని తేల్చి చెప్పేశాడు సత్యరాజ్‌. తనకు తమిళ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని క్లారిటీ ఇచ్చాడు. తమిళనాడు ప్రజల తరఫున పోరాడేందుకు సిద్దంగా వున్నానన్నాడు. 

'బాహుబలి ది బిగినింగ్‌' సినిమా కర్నాటకలోనూ విడుదలయ్యింది. తొమ్మిదేళ్ళ క్రితం కావేరీ వివాదానికి సంబంధించి సత్యరాజ్‌ వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేసిన కన్నడిగులు, ఆ పేరు చెప్పి అతని సినిమాల్ని అడ్డుకోవాలనుకుంటే 'బాహుబలి ది బిగినింగ్‌'నే అడ్డుకుని వుండాలి. సత్యరాజ్‌ నటించిన చాలా సినిమాలు కన్నడలోకి డబ్‌ అయ్యాయి.. స్ట్రెయిట్‌గానూ పలు తమిళ సినిమాలు కర్నాటకలో విడుదలయ్యాయి. వాటికెప్పుడూ అభ్యంతరాలు రాలేదు. 

కేవలం 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌ నేపథ్యంలో, ఈ సినిమాని దెబ్బకొట్టడానికే, సత్యరాజ్‌ని అడ్డంపెట్టుకున్నారక్కడ. ఇక్కడే, సత్యరాజ్‌ హుందాగా వ్యవహరించాడు. 'మీ ఖర్మకి మీరే పోతారు..' అన్నట్టుగా క్షమాపణ చెప్పేశాడు. అంతలోనే, తమిళ ప్రజల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోనని అన్నాడు. అదే సమయంలో, దర్శక నిర్మాతలకీ స్పష్టమైన సందేశమిచ్చాడు. అదేంటంటే, ఇకపై తనతో సినిమాలు చేయాలనుకునేవారు.. ఇలాంటి వివాదాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. 

అంటే, 'నచ్చితే నాతో సినిమాలు చేయండి.. నచ్చకపోతే మానెయ్యండి.. నా చేత మళ్ళీ క్షమాపణలు చెప్పించాలనుకోవద్దు..' అనే భావం సత్యరాజ్‌ మాటల్లో సుస్పష్టంగా కన్పించింది. అందుకే మరి, 'ఆడు మగాడ్రా బుజ్జీ..' అని సత్యరాజ్‌ గురించి ఇప్పుడు అంతా అనుకుంటున్నది. తాను ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో తమిళ ప్రజలు, తమిళ సినీ పరిశ్రమ అర్థం చేసుకోవాలంటూ.. మరో 'సందేశం' కూడా సత్యరాజ్‌ ఇచ్చేశాడండోయ్‌.  Readmore!

అంతా బాగానే వుందిగానీ.. సత్యరాజ్‌ ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలికినట్లేనా.? 'బాహుబలి ది కంక్లూజన్‌' వరకూ క్లారిటీ సరిపోద్దేమోగానీ, ఆ తర్వాత సంగతేంటి.? అని ఆలోచిస్తే, సత్యరాజ్‌ వివాదాల్ని ఫేస్‌ చేయడానికి సిద్ధంగానే వున్నాడనే విషయం అర్థమవుతుంది.

Show comments