సుప్రీం నుంచి హైకోర్టుదాకా.!

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో వైఎస్సార్సీపీకి సానుకూలంగా ఏ నిర్ణయమూ రావడంలేదు. సభాపతి కోడెల శివప్రసాద్‌కి, పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తే, 'ఆ ఫిర్యాదు సరైన ఫార్మాట్‌లో లేదు..' అంటూ తీరిక చూసుకుని తిప్పి కొట్టారు. పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడమెలా.? అని మళ్ళీ వైఎస్సార్సీపీ సందిగ్ధంలో పడిపోయింది. 

అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపైనా, స్పీకర్‌పైనా అవిశ్వాసం పెట్టి, తద్వారా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నించినా, అధికార పక్షం.. చట్ట సభల్ని తనక్కావాల్సిన విధంగా మార్చేసుకుని, కుట్రలు.. కుయుక్తులతో వైఎస్సార్సీపీ వ్యూహాల్ని చిత్తుచేసింది. ఇక, మిగలింది ఒక్కటే మార్గం.. అదే న్యాయ పోరాటం. ఏం లాభం.? ఇక్కడా వైఎస్సార్సీపీకి షాకే తగులుతోంది. 

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ని ఆదేశించాలంటూ వైఎస్సార్సీపీ పిటిషన్‌ వేస్తే, 'హైకోర్టుకు వెళ్ళండి..' అంటూ సర్వోన్నత న్యాయస్థానం 'ఉచిత సలహా' ఇచ్చింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు, హైకోర్టుకు సూచించింది. అంటే, బంతి మళ్ళీ హైకోర్టులో వచ్చి పడిందన్నమాట. 

ఇక్కడో కథ చెప్పుకోవాలి. కథ కాదిది.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యధ. అసెంబ్లీ నుంచి ఏడాది కాలానికి సస్పెన్షన్‌ వేటుకి గురైన రోజా, ఆ సస్పెన్షన్‌ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. అక్కడామెకు చుక్కెదురయ్యింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కాస్త ఊరట దొరికింది.. అయితే ఆ ఊరట, హైకోర్టు రోజా ఫిర్యాదును పునఃపరిశీలించాలని మాత్రమే. ఎలాగైతేనేం, హైకోర్టు నుంచి అసెంబ్లీకి వెళ్ళేందుకు రోజాకి అనుమతి లభించింది. టీడీపీ సర్కార్‌ ఒప్పుకుందా.? లేదు, స్పీకర్‌ విశేషాధికారాల్ని చూపిస్తూ, రోజాకి హైకోర్టు ద్వారా దక్కిన కాస్త ఊరటనీ చెడగొట్టేసింది.  Readmore!

సో, ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చిందన్నమాట. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలోనూ ఇందుకు భిన్నంగా పరిస్థితులు కన్పించే అవకాశం లేదు. ఫిరాయింపులపై ఫిర్యాదుకు సంబంధించి 'ఫార్మాట్‌' సరిగ్గా లేదని స్పీకర్‌ తేల్చి చెప్పిన దరిమిలా, ఇంకోసారి వైఎస్సార్సీపీ సవివరంగా, పద్ధతిగా స్పీకర్‌కి ఫిర్యాదు చేయాలన్నమాట. ఈలోగా హైకోర్టు, ఫిరాయింపులపై కేసుని విచారించి, ఏదో ఒక 'ఊరట' వైఎస్సార్సీపీకి లభించినా. తిప్పి పంపడానికి స్పీకర్‌ని టీడీపీ ఈపాటికే సమాయత్తం చేసేసి వుండాలి. 

మొత్తమ్మీద, ప్రజాస్వామ్యం అంటే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీకి ఓ 'పొలిటికల్‌ గేమ్‌'లా మారిపోయింది. ఎత్తులకు పై యెత్తులు వేసి, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం తప్ప, పద్ధతి ప్రకారం నడవాలనీ, రాజ్యాంగ విలువల్ని పాటించాలనీ అనుకోవడంలేదు. స్పీకర్‌ అయినా, టీడీపీ ఆలోచనలకు భిన్నంగా ఏమీ చేయలేని పరిస్థితి. స్పీకర్‌ని కాదని, న్యాయస్థానాలు.. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మార్పు ఎలా సాధ్యం.? మార్పు సాధ్యమైతే తప్ప, ఫిరాయింపుల్ని నివారించలేం.

Show comments