ఓట్టు.. ఇది మాత్రం రాజకీయం కాదు.!

రాజకీయ నాయకులు రాజకీయం చేయడంలేదంటే నమ్మగలమా.? ఛాన్సే లేదు. కానీ, చంద్రబాబు చెబితే నమ్మాలి. ఎందుకంటే, ఆయన నిప్పు నారా చంద్రబాబునాయుడు. తప్పదు, ఆయన డిక్షనరీ ఫాలో అయితే 'తప్పు' అయినాసరే, ఒప్పులా కనబడి తీరాల్సిందే.! వినేటోళ్ళు వెర్రి వెంగళప్పలయితే, చెప్పెటాయన నారా చంద్రబాబునాయుడు అని ఊరకనే అన్నారా.? 

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాలేదు. కానీ, అక్కడ ఉప ఎన్నిక హీట్‌ తారాస్థాయికి చేరింది. చంద్రబాబు మొత్తంగా టీడీపీ ముఖ్య నేతలందర్నీ అక్కడే మోహరించేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు (ఇతర నియోజకవర్గాలకు చెందినవారు కూడా) అక్కడే వుండి, నంద్యాల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన పుత్రరత్నం సంగతి సరే సరి.! 

నంద్యాలని విశాఖలా మార్చేస్తానన్నారు చంద్రబాబు తాజాగా. అంటే, దానర్థమేంటి.? విశాఖ తరహాలో నంద్యాలకీ ఓ సముద్రాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసేస్తారేమో. సినిమాల్లో వింటుంటాం, హైద్రాబాద్‌కి సముద్రం తీసుకొస్తానని పెద్ద కామెడీ చేసేస్తారు. అచ్చంగా చంద్రబాబు ఎన్నికల హామీలు కూడా అలాగే తగలడ్డాయి. 'మీరు ఏమన్నా అడగండి, ఇచ్చేస్తాను..' అంటున్నారు చంద్రబాబు.! 

ఏంటీ, నిజంగానే ఇచ్చేస్తారా.? అనడక్కండి. 2014 ఎన్నికల సమయంలో అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారు గుర్తుందా.? ఇదీ అంతే. అక్కడ అమరావతికి రూపం లేదు, ఇక్కడ నంద్యాలలో చంద్రబాబు ఇచ్చే హామీలకు అడ్రస్‌ వుండదు. హామీలు మాత్రం గుప్పించేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల వేళ ఉత్త రాజకీయ హామీలే కదా.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, 'నేనా, రాజకీయమా.?' అంటూ చంద్రబాబు అత్యంత అమాయకంగా ముక్కున వేలేసుకుంటున్నారు. 

2014 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ చావుదెబ్బ తినేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఆ ఓటమిని జీర్ణించుకోలేక, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చంద్రబాబు, మంత్రి పదవి ఎరచూపి, నంద్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి లాక్కొచ్చారు. దురదృష్టవశాత్తూ మంత్రి పదవి దక్కలేదన్న బెంగతో భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. అలా భూమా ఉసురు చంద్రబాబు పోసుకున్నారన్నది నిర్వివాదాంశం. 

మళ్ళీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటున్నారు చంద్రబాబు. ఇది రాజకీయం అనాలా.? శవరాజకీయం అనాలా.?

Show comments