పవన్‌కళ్యాణ్‌.. కాస్త సీరియస్‌గానే.!

'కాటమరాయుడు'కి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా దెబ్బ గట్టిగానే తగిలేలా వుంది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా అంచనాల్ని అందుకోలేక, బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడ్డ విషయం విదితమే. 50 కోట్ల వసూళ్ళ మార్కుని టచ్‌ చేసిందనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పుణ్యమా అని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగానే దెబ్బతినేశారు. 'అంతా అత్యాశ..' అనే విమర్శ డిస్ట్రిబ్యూటర్లపై విన్పిస్తున్నా, అదే సమయంలో, నిర్మాతల అత్యాశ గురించీ చెప్పుకోవాలి కదా.! 

నష్టమైపోతే జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని భరించేదెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మామూలుగా అయితే, కాస్తో కూస్తో నిర్మాతలు ఆదుకోవాలి. నిర్మాతలు.. అంటే, ఇక్కడ శరద్‌మరార్‌తోపాటు, పవన్‌కళ్యాణ్‌ కూడా వుండాలి మరి. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ బాగా ఆడి వుంటే, డబ్బులొచ్చాయి. ఈసారి సినిమాల్ని గట్టిగా చూడండి..' అంటూ ఆ మధ్య ఓ బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అంటే, ఆయనా కాస్తో కూస్తో నష్టపోయాడనుకోవాలేమో.! 

గట్టిగానే అమ్మేసుకున్నారు గనుక, నిర్మాతలు నష్టపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.. ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొస్తున్నారు. దాంతో విషయం పవన్‌కళ్యాణ్‌దాకా వెళ్ళకుండా వుండదు కదా.! వెళ్ళిందికానీ, పవన్‌కళ్యాణ్‌ అప్పుడే స్పందించేందుకు సుముఖంగా లేడట. 'కాటమరాయుడు' విడుదల తర్వాతే స్పందించాలని పవన్‌కళ్యాణ్‌ నిర్ణయించుకున్నాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం.

అయితే, గతంలో 'అత్తారింటికి దారేది' సినిమాకి సంబంధించి రావాల్సిన బకాయిలపై నిర్మాతని, 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదలకు ముందు పవన్‌ నిలదీసిన విషయం విదితమే. ఆ లెక్కన పవన్‌ కూడా, 'కాటమరాయుడు' రిలీజ్‌ కంటే ముందే స్పందిస్తే బెటర్‌ అన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. 'పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌గానే వున్నారు.. సర్దార్‌ బాధితుల గురించి ఆలోచిస్తున్నారు..' అనే లీకేజీల్ని పంపడం కన్నా, ఆ సీరియస్‌నెస్‌ ఏదో పవన్‌ ముందే చూపిస్తే మంచిది.

Show comments