మా ఇష్టం.. మేం చంపేసుకుంటాం.!

తల్లిదండ్రులుగా మా పిల్లల్ని చంపేసుకునే హక్కు మాకు లేదా.? అని ప్రశ్నిస్తున్నట్లుంది.. హైద్రాబాద్‌లో 13 ఏళ్ళ బాలిక, ఉపవాస దీక్ష చేసి ప్రాణాలు కోల్పోవడంపై ఆమె తల్లిదండ్రులు చేస్తోన్న వితండ వాదన చూస్తోంటే. 

'మా అమ్మాయిది సహజ మరణమే..' అంటూ మృతురాలి తండ్రి తెగేసి చెబుతున్నాడు. 68 రోజుల ఉపవాస దీక్ష అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యిందీ ఘటన. బాలల హక్కుల సంఘాలు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద దుమారమే చెలరేగుతున్నాయి. జైన మత సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్ష అనేది చాలా పవిత్రమైనది. 

ఏ మతానికి ఆ మతం.. కొన్ని ఆచారాల్ని పాటిస్తుంటాయి. ఆ ఆచారాల్ని పూర్తిస్థాయిలో తప్పుపట్టేయడానికి వీల్లేదు. అయితే, ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఏ సంప్రదాయం తీసుకొచ్చినా, దాని చుట్టూ చర్చ జరిగి తీరాల్సిందే. ఒకప్పుడు సతీ సహగమనం అనేది మూఢాచారంగా కొనసాగేది. ఇప్పుడలా ఎవరూ సతీ సహగమనాన్ని ప్రోత్సహించలేరు కదా.! 

''68 రోజులు ఉపవాస దీక్ష చేసింది.. 69వ రోజు బాగానే వుంది.. 70వ రోజు కూడా బాగానే వుంది.. అర్థరాత్రి కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యింది..'' ఇదీ మృతురాలు ఆరాధన తండ్రి లక్ష్మీచంద్‌వాదన. ఆచారాల ప్రకారం తన కుమార్తె ఉపవాస దీక్ష చేసిందనీ, గతంలో కూడా ఇలాంటి దీక్ష ఆమె చేసిందనీ, హైద్రాబాద్‌లో 10 వేల కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయనీ, ఎప్పుడూ ఎవరికీ ఇలా జరగలేదనీ, తన కుమార్తె మరణం సహజ మరణం మాత్రమేనని ఆయన చెబుతున్నాడు. 

తన కుమార్తె మరణం గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మీచంద్‌లో ఏమాత్రం కుమార్తె చనిపోయిందన్న బాధ కన్పించడంలేదు. 'చాలా సహజమైన విషయం'గా ఆయన లైట్‌ తీసుకుంటున్న తీరు చూస్తోంటే, మూఢ నమ్మకాలకి ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాల్ని బలిపెట్టారా.? అన్న అనుమానాలు కలగకమానదు. 

లక్ష్మీచంద్‌కి మద్దతుగా జైనమతస్తులు, తమ ఆచారాల్లో ఇది చాలా సాధారణమని చెబుతుండడం గమనార్హం. జరిగిన ఘటన దురదృష్టకరమనీ, ఈ వివాదం పేరు చెప్పి తమ ఆచారాలపై దుష్ప్రచారం తగదని వారంటున్నారు. ఆచారాలు సరే, 13 ఏళ్ళ బాలిక ప్రాణాల్ని ఎవరు తీసుకొస్తారు.? ఏ మతం అయినాసరే, ప్రాణాలు తీసుకోమని చెప్పదు.

Show comments