లోకేష్‌ వెళ్ళరుగానీ.. వాళ్ళు వెళ్ళిపోతారట

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోనే మకాం వేశారు. అయినాసరే, అత్యాధునిక సౌకర్యాలతో హైద్రాబాద్‌లో భవంతిని నిర్మించుకున్నారు. లోకేష్‌ మంత్రి అయ్యాక కూడా, ఇంకా హైద్రాబాద్‌ నుంచి మకాం మార్చలేదు. ఏమో, భవిష్యత్తులో ఆయన తన మకాం అమరావతికి మార్చుకుంటారేమో.! 

ఉమ్మడి రాజధాని కాబట్టి, హైద్రాబాద్‌ని పూర్తిగా పదేళ్ళు వాడుకుంటామని ఇదే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గతంలో నినదించింది. కానీ, ఓటుకు నోటు దెబ్బకి అమరావతికి పారిపోవాల్సి వచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. 'కుటుంబానికి దూరంగా వుంటున్నా.. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.. అయినాసరే, రాష్ట్రం కోసం త్యాగం చేసేస్తున్నా..' అని చంద్రబాబు గొప్పగా చెప్పేసుకుంటారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అసలు విషయానికొస్తే, 'హైద్రాబాద్‌ నుంచి విశాఖకు తరలి వచ్చేందుకు ఐటీ నిపుణులు సిద్ధంగా వున్నారు..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిథులతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారట లోకేష్‌. ఆయన పేల్చిన ఈ జోక్‌కి అంతా ఫక్కున నవ్వుకున్నారు. హుద్‌హుద్‌ తుపానుకన్నా గట్టిగా, విశాఖ మీద 'నిర్లక్ష్యం' అనే బాంబు పేల్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. దాంతో, విశాఖలో ఐటీ పరిశ్రమ వెలుగు అనేది ఓ కలగానే మిగిలిపోయింది. 

ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ మళ్ళీ విశాఖ మీద కొత్త మమకారం ప్రదర్శిస్తోంటే, ఆశ్చర్యం కలగకమానదెవరికైనా. ఓ పక్క, విజయవాడ పరిసరాల్లో ఐటీ సంస్థలకు అవకాశాలు కల్పిస్తామని చెబుతూ, అక్కడే పలు సంస్థల్ని ప్రారంభించేసిన లోకేష్‌, విశాఖ వరకూ ఐటీ సంస్థల్ని వెళ్ళనిస్తారా.? ఛాన్సే లేదు. అసలు విజయవాడకే ఐటీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి తరలి వెళ్ళేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవాయె. అన్నిటికీ మించి, ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని నెలకొంటోందిప్పుడు. 

Readmore!

అయినాసరే, ఐటీ నిపుణులు హైద్రాబాద్‌ నుంచి విశాఖ తరలి వెళ్తారు.. ఎందుకంటే, చెప్పింది నారా లోకేష్‌ గనుక. ఇంతకీ, లోకేష్‌ గారూ మీరెప్పుడు హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి మకాం మార్చుతారట.?

Show comments