విజయదశమి: మొహం చాటేసిన చంద్రబాబు.?

గత ఏడాది విజయదశమికి ఆంధ్రప్రదేశ్‌లో పండగ వాతావరణం నెలకొంది. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగింది ఆ రోజే. ప్రధాని నరేంద్రమోడీ అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి శంకుస్థాపన చేశారు. కోట్లాది రూపాయల్ని మంచి నీళ్ళలా ఖర్చు చేసి ఆ ఈవెంట్‌ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఫ్లాప్‌ షో అనలేంగానీ, ఆ ఈవెంట్‌ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌కి విజయదశమి కానుకగా ఇవ్వలేకపోయారు. 

గతం గతః ప్రస్తుతానికి వస్తే, ఏడాది పూర్తయిపోయింది. రాజధాని అమరావతి నిర్మాణం ఏదీ, ఎక్కడ.? అనే ప్రశ్నలే మిగిలిపోయాయి. ఈ విజయదశమికి తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు, తన కార్యాలయాన్ని ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, గత ఏడాది శంకుస్థాపన ఫెయిలయిన నేపథ్యంలో, విజయదశమి తనకు అచ్చిరాదనుకున్నారో ఏమో, విజయదశమికి మొహం చాటేసి, ఆ మరుసటి రోజున తన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు చంద్రబాబు. 

ఆగండాగండీ, గతంలో ఓ సారి చంద్రబాబు, తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాన్ని ప్రారంభించేశారనే కదా మీ డౌట్‌.? అక్కడున్నది నారా చంద్రబాబునాయుడు. ఆయనిష్టం, ఎన్నిసార్లయినా భూమి పూజ చేస్తారు, ఎన్నిసార్లయినా ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి పదవికి వన్నె తేవడం సంగతి పక్కన పెడితే, ఈవెంట్‌ మేనేజర్‌గా చంద్రబాబు నూటికి నూట యాభై మార్కులు సంపాదించేసుకున్నారు ఇప్పటికే. ఈసారి ఈవెంట్‌ విజయదశమికి కాకుండా, విజయదశమి మరుసటి రోజుకి ఫిక్స్‌ అయ్యింది.. అంతే తేడా.!

Readmore!
Show comments