కోట్లు ఖర్చవుతుంటాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల కోసం. తప్పదు మరి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే పెట్టుబడులు కావాలి.. ఆ పెట్టుబడుల్ని విదేశాల నుంచే రాబట్టాలి. కానీ, ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అవుతోందిగానీ, పెట్టుబడులు మాత్రం రావడంలేదాయె.!
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో వున్నారు. గతంలోలానే, ఈసారి కూడా దావోస్ పర్యటనలో అద్భుతాలు జరిగిపోతున్నాయంటూ చంద్రబాబు, తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. ఈ పబ్లిసిటీకి ఖర్చు చంద్రబాబు జేబులోంచా.? లేదంటే, ఆంధ్రప్రదేశ్ ఖజానాలోంచా.? అన్నది వేరే విషయం. పబ్లిసిటీ అయితే జరుగుతోంది.!
విశాఖలో గతంలో పలు సదస్సులు జరిగాయి. వీటి కోసం భారీగా ఖర్చు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించేశారు. 4 లక్షల కోట్లు కాదు కదా, 40 వేల కోట్లు అయినా పెట్టుబడులు వచ్చాయా.? అంటే, ప్చ్.. లేదనే సమాధానమే వస్తుంది. ఇప్పుడు దావోస్ పర్యటన అయినా అంతే.!
సింగపూర్ ప్రభుత్వం, అమరావతి నిర్మాణంలో సహకరించడం.. చైనా, జపాన్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం.. ఇవన్నీ చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. గడచిన రెండేళ్ళలో చంద్రబాబు విదేశీ పర్యటనలకీ, చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లకీ ఖర్చు చేసిన దాంట్లో సగమైనా పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చిందా.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేదెలా.? ఖర్చు దండగ వ్యవహారం అని చంద్రబాబు టూర్స్ విషయంలో ఎందుకు అనకూడదట.!