ఏపీలో కాంగ్రెసు ప్రాణం పోసుకునేదెలా?

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఆ పని చేసిన కాంగ్రెసు పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎంత దయనీయంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఉండీ లేనట్లుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో శూన్యం. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు వెలుగు వెలిగి అధికారం వెలగబెట్టిన పార్టీకి తీర్చలేని కష్టం వచ్చింది. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలి. ఆంధ్రలో పూర్తిగా ప్రాణం పోయాలి. ఈ పని ఎలా చేయలి? అని రాష్ట్రాల్లోని నాయకులతోపాటు అధిష్టానం పెద్దలు కూడా తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొన్నటి పాలేరు ఉప ఎన్నిక వరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 

కంటితుడుపుగా ఒకటి రెండు చోట్ల విజయం సాధించడం మినహా ఏమీ లేదు. ఎన్నికల తరువాత ఈమధ్య పలువురు ముఖ్య నాయకులే గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఫిరాయింపుదారులను ఆపడం చేతకాకపోవడంతో రాష్ట్ర, కేంద్ర సారథులు 'పోతే పొండి. ఏం నష్టం లేదు' అని పైకి బింకంగా అన్నారుగాని చాటుగా నీరుగారిపోయారు. తెలంగాణ విషయం అలా ఉంచితే వచ్చే సాధారణ ఎన్నికల్లోగా ఆంధ్రాలో పార్టీకి పోయాలని రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈలోగా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 

విభజన తరువాత తెలంగాణలో చాలా ఎన్నికలు జరిగాయిగాని ఆంధ్రలో జరగలేదు. దీంతో అధికార, ప్రతిపక్షాలకు తమ బలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునే అవకాశం కలగలేదు. కొద్ది రోజుల్లో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు, ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో తలపడటానికి కాంగ్రెసు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వైఎస్సార్‌ కాంగ్రెసు కూడా స్థానిక ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీని దెబ్బతీయాలనుకుంటోంది. 

ఉమ్మడి రాష్ట్రాన్ని తాము ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో విభజించలేదని, అన్ని పార్టీలు అంగీకరించిన తరువాతే విభజన జరిగిందని కాంగ్రెసు  ప్రజలకు వివరించబోతోంది. ఈ విషయంలో ప్రధానంగా టీడీపీని దోషిగా చేయాలని  ప్లాన్‌ చేస్తోంది.  ఏ పార్టీ అయినా ప్రజల్లో బలం పెంచుకోవాలంటే, ఆదరణ పొందాలంటే ఆందోళనలు, ఉద్యమాలు అవసరం. అలాగే వాటిల్లో కొందరు 'పెద్ద తలకాయలు' పాల్గొనడం, రాష్ట్రంలో పర్యటించడం అవసరం. కాంగ్రెసు పార్టీ ఈ కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తోంది.  రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉన్నారు.రాబోయే రోజుల్లో ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటిస్తారు. 

అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వస్తారట. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల పరిరక్షణ చట్టం పేరుతో ఓ చట్టం చేసింది. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా నీరుగారిపోయిందని కాంగ్రెసు ఆవేదన చెందుతోంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభించాలని కాంగ్రెసు నిర్ణయించింది. రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమం ప్రారంభిస్తారు. ఆ తరువాత సోనియా గాంధీ వస్తుండవచ్చు. వచ్చే నెల ఆరో తేదీన రాహుల్‌ విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో ఉద్యమానికి శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా 45 గిరిజన గ్రామాల్లో  పర్యటిస్తారు. 

ఈ గ్రామాలన్నీ బాక్సైట్‌ గనులున్న ఊళ్లు.  రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు మీద ఏపీ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారా? కోపం తగ్గించుకున్నారా? అనేది తెలుసుకోవాలంటే ఏవైనా ఎన్నికలు జరిగితేనే సాధ్యం. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిపోయింది. కాంగ్రెసుపై కోపం తగ్గిందా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబు మీద వ్యతిరేకత పెరగుతోందని కాంగ్రెసు నాయకులు అంచనా వేస్తున్నారు. అది తమకు అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నారు. అయితే బాబుపై వ్యతిరేకత ఉంటే అది వైఎస్సార్‌సీపీకి అనుకూలం అవుతుందిగాని కాంగ్రెసుకు ఎలా అవుతుందనేది కొందరి సందేహం. ఏది ఏమైనా కాంగ్రెసు తన ప్రయత్నాలు తాను చేయడంలో తప్పు లేదు. జరిగిందేదో జరిగిపోయిందని, గత ఎన్నికల్లో ప్రజలు పెద్ద శిక్ష వేసినా క్రమంగా క్షమిస్తారని నమ్ముతున్నారు. 

Show comments