10 కోట్లకి 'ముగ్గు'.. కోటిన్నర కొట్టేశాడు.!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతటి అభివృద్ధి అయినా సాధించనివ్వండి.. మేం మాత్రం మూర్ఖులమే.. అంటారు కొందరు. సైన్స్‌ సైన్సే.. మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలే. నమ్మకం వేరు, మూఢ నమ్మకం వేరు. నమ్మకాలని తప్పు పట్టలేం, కానీ, మూఢ నమ్మకాలున్నాయే.. వాటితోనే వస్తోంది అసలు చిక్కు. ఓ మనిషి తలని, ఇంకో వ్యక్తి శరీరానికి కలిపేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ పక్క. ఇది శాస్త్ర సాంకేతిక విప్లవం.. అని చెప్పక తప్పదు. 

కానీ, దురదృష్టవశాత్తూ టెక్నాలజీతోపాటు, మూఢ నమ్మకాలూ పెరిగిపోతున్నాయి. పల్లెటూళ్ళకే పరిమితమైపోయిన మూఢ నమ్మకాలు ఇప్పుడు పట్నాలకీ పాకేశారు. హైటెక్‌ సిటీ హైద్రాబాద్‌లో, ఓ బడా వ్యాపారవేత్త ఇంట్లో ఓ దొంగ బాబా కోటిన్నర రూపాయలు కొల్లగొట్టేశాడు. అదీ పూజల కోసమని చెప్పి. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో.! ఆ ఆనందం కాస్తా, ఇప్పుడు ఆవేదనగా మిగిలిపోయింది. 

అసలు విషయమేంటంటే, అయ్యగారికి ఒక కోటి రూపాయల్ని పది కోట్ల రూపాయలుగా మార్చేసుకోవాలని రాత్రికి రాత్రి ఆలోచన పుట్టింది. ఇలాంటి తింగరోళ్ళని క్యాష్‌ చేసుకోడానికి ఎప్పుడూ అక్రమార్కులు రెడీగానే వుంటారు కదా.! అందుకే, ముందు కోటి రూపాయలు రెడీ చేసుకొమ్మని చెప్పాడో దొంగబాబా. కర్నాటక నుంచొచ్చాడట. పూజ మొదలెట్టాడు. ముగ్గులు వేశాడు.. ముగ్గులోకి దించేశాడు. పూజ పూర్తయ్యింది, ప్రసాదం పెట్టాడు. అంతే, ఆ తర్వాత అంతా హంబక్‌. 

వస్తాయనుకున్న పది కోట్లు రాలేదు సరికదా, తన వద్దనున్న కోటిన్నర హాంఫట్‌ అయిపోయాయి. బాబా గాయబ్‌. అత్యాశాపరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బులు చెట్లకి కాస్తున్నాయా.? అని అనడం మనకి వెటకారంలో పరిపాటే. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా.? అన్నదీ వెటకారమే. కానీ, దాన్ని నిజం చేసెయ్యాలనుకుని.. ఇదిగో ఇలా బోల్తా కొట్టేస్తున్నారు. 

చిత్రంగా ఇలాంటి దొంగ స్వామీజీల తాట తియ్యాల్సిన పాలకులు, ఆ బాబాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం దురదృష్టకరం కాక మరేమిటి.? దొంగ బాబాలు, స్వామీజీలకు పొలిటికల్‌ పబ్లిసిటీ పెరిగిపోతోంటే, బడా బాబులు తమ పాపాలకు నివృత్తి కోసమో, అప్పనంగా డబ్బు సంపాదించడం కోసమో వారిని ఆశ్రయించడంలో వింతేమీ లేదు. సెక్సానందలు దొరుకుతారు.. రొమాంటిక్‌ బాబాలు తెరపైకొస్తుంటారు.. హత్యలు చేసే సిద్ధులు కనిపిస్తారు.. అయినా వాళ్ళనే నమ్ముతాం. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.

Show comments