సిద్దూ కసి తీరా ఓడించాడు.!

పంజాబ్‌ ఎన్నికల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటిదాకా అక్కడ అధికారంలో వున్న అకాళీదళ్‌తో కూటమి కట్టిన బీజేపీ, ఎలాగైనా సత్తా చాటుదామనుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ కూడా పంజాబ్‌ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అకాళీదళ్‌తోపాటు, బీజేపీ కూడా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించగా, రెండో స్థానంలో నిలిచింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల్లో కాంగ్రెస్‌ - ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ వుంటుందని తేలింది. అయితే, ఓ సర్వేలో ఆమ్‌ ఆద్మీ పార్టీదే అధికారమని కూడా ఫలితాలొచ్చాయి. కానీ, వాస్తవ ఫలితాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది. 

ఈ గెలుపుతో అందరికన్నా ఎక్కువ సంతోషంగా వున్నది మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూనే. అకాళీదళ్‌ - బీజేపీ ఓటమి కన్నా ఆయనకు ఎక్కువ ఆనందం కలిగించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమే. బీజేపీ నుంచి సిద్దూ బయటకి రావడానికి కారణం ఆమ్‌ ఆద్మీ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశగా చూపిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, చివరి నిమిషంలో సిద్దూకి హ్యాండించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, ఓ రేంజ్‌లో సిద్దూని అవమానించిన వైనం అందరికీ తెల్సిందే. అందుకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమితో సిద్దూ సంబరాలు చేసుకుంటున్నారు. అహంకారానికి తగిన శాస్తి జరిగిందంటూ తాజాగా సిద్దూ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. 

మరోపక్క, సిద్దూకి పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు, పంజాబ్‌లో కాంగ్రెస్‌కి గెలిపించి, రాహుల్‌గాంధీకి కానుకగా ఇస్తానని ఎన్నికల ప్రచారంలో సిద్దూ వ్యాఖ్యానించాడు. అవాజ్‌ ఎ పంజాబ్‌ పార్టీ పెట్టినా, సిద్దూ రిస్క్‌ చెయ్యలేదు.. కాంగ్రెస్‌లో ఆ పార్టీని కలిపేసి, కాంగ్రెస్‌ నుంచి 'పొలిటికల్‌ స్టార్‌' అనిపించుకున్నాడంతే.

Readmore!

Show comments

Related Stories :