2000 నోటు.. జోక్‌ ఆఫ్‌ ది డికేడ్‌.!

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరంగారి చేతికి ఇంతవరకూ 2 వేల రూపాయల నోటు దొరకలేదట. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పోటోడు చిదంబరం.. అనాలేమో ఇకపై.! 

దేశవ్యాప్తంగా పెద్ద పాత నోట్ల రద్దు అనంతరం తీవ్రమైన సంక్షోభం నెలకొందన్నమాట వాస్తవం. సామాన్యుడికి కరెన్సీ దొరకడం గగనమైపోయిందిగానీ, రాజకీయ నాయకులకి సమస్యలేమీ లేవు. కోట్లకు కోట్లు మురిగిపోతున్నాయి రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, బినామీల ఇళ్ళల్లో. ఎక్కడిదాకానో ఎందుకు, బీజేపీ నేతలకే కరెన్సీ సమస్య లేదు. వాళ్ళ ఇళ్ళల్లోనూ పెద్దయెత్తున పెద్ద కొత్త నోట్లు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెసోళ్ళ చేతికీ అందకుండా వుంటాయా.? 

పైకి, రాజకీయంగా ఒకర్ని ఒకరు దూషించుకుంటారుగానీ, రాజకీయ నాయకులందరిదీ ఒకటే 'జోన్‌' కదా.! పరస్పర సహాయ సహకారాలు వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇక, పెద్ద పాత నోట్ల రద్దు అనేది అతి పెద్ద కుంభకోణమని చిదంబరం విమర్శించేశారు. కుంభకోణమా.? కాదా.? అన్నది వేరే విషయం. కుంభకోణమని కాంగ్రెస్‌ నిజంగానే భావిస్తే, కేంద్రాన్ని ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పెట్టిందెక్కడ.! పార్లమెంటుని స్తంభింపజేసేస్తే ప్రభుత్వం దిగొస్తుందా.? ఛాన్సే లేదు. 

నిజానికి అవినీతి గురించి, స్కామ్‌ల గురించీ చిదంబరంకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన కుటుంబ సభ్యులపైనే కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలున్నాయి. ఏదిఏమైనా, పెద్ద పాత నోట్ల రద్దుపై కేంద్రాన్ని ప్రశ్నించడం వరకూ చిదంబరంను తప్పు పట్టలేం. మరీ, కామెడీగా 2 వేల రూపాయల నోటు ఇంకా తనకు దక్కలేదనడమే ఈ ఏడాదికే.. కాదు కాదు, ఈ దశాబ్దానికే అతి పెద్ద జోక్‌.! అచ్చంగా చిదంబరంగారి తమిళనాడులోనే, పలు రాజకీయ పార్టీలకు అత్యంత సన్నిహితుడిగా వుండే 'బినామీ' శేఖర్‌రెడ్డి దగ్గర ఏకంగా 170 కోట్ల రూపాయల నల్లధనం దొరికింది.. 150 కిలోల బంగారమూ దొరికింది. 

చిద్దూ సాబ్‌.. కాస్తంత చూసి మాట్లాడండి సాబ్‌.. నవ్వులపాలైపోతారు జాగ్రత్త.!

Show comments