చంద్రబాబు దెబ్బకి మోడీ భయపడ్డారట.!

విన్నారా ఈ విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దెబ్బకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భయపడిపోయారట. పోలవరం ప్రాజెక్టు కోసం 'ఏడు మండలాల్ని' ఆంధ్రప్రదేశ్‌కి బదలాయించాల్సిందేనంటూ చంద్రబాబు హుకూం జారీ చేయడం, అలా చేస్తేనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తానని అల్టిమేటం జారీ చేయడంతో.. చేసేది లేక ప్రధాని నరేంద్రమోడీ, ఆ ఏడు మండలాల బదలాయింపుపై ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చారట. కడప టూర్ సందర్భంగా చంద్రబాబు చిలకపలుకుల సారాంశమిది. 

అదిరిందయ్యా చంద్రం.! నిజానికి, ఆ ఆర్డినెన్స్‌ యూపీఏ హయాంలో తయారైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేయడంతో, ఆర్డినెన్స్‌ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందినా, అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళలేకపోయింది. సరే, దాని వెనుక రాజకీయాన్ని ఎవరు కాదనగలం.? నరేంద్రమోడీ సర్కార్‌, ముంపు మండలాల్ని బదలాయించిన క్రెడిట్‌ అయితే సొంతం చేసుకుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అక్కడికేదో అది తన ఘనతేనని చంద్రబాబు అనుకుంటే ఎలా.? 

చంద్రబాబు అడగాలనుకుంటే, ఇంకా చాలా చాలానే వున్నాయి. అందులో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. దాంతోపాటుగా ప్రత్యేక ప్యాకేజీ రావాల్సి వుంది. ఇవన్నీ పక్కన పడేసి, 'ప్రత్యేక సహాయం' అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది నరేంద్రమోడీ సర్కార్‌. కేంద్రం వేసిన బిచ్చమే మహాభాగ్యమనుకుంటున్నారాయన. అదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఏదయ్యా చంద్రబాబూ, విశాఖకి ప్రత్యేక రైల్వే జోన్‌.? అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రాదు. అంతెందుకు, రాజధాని అమరావతికి కేంద్రం ఏం నిధులు ఇచ్చింది.? అనడిగితే, చంద్రబాబు నీళ్ళు నమిలేస్తారు. 

చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే వున్నాయి. దేని విషయంలోనూ చంద్రబాబు, నరేంద్రమోడీని బెదిరించలేకపోయారు. అయినా, కేంద్రంలో తగినంత బలం వున్న నరేంద్రమోడీ, చంద్రబాబు మాటలకు బెదిరిపోయారనో, చంద్రబాబు మారాం చేస్తే బొచ్చెలో బిచ్చం వేశారనో అనుకుంటే ఎలా.? పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌.. దానికి సంబంధించి అడ్డంకులు తొలగించాల్సింది కేంద్రమే. నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. నిధులూ కేంద్రమే ఇవ్వాలి. ఇది విభజన చట్టం చెప్పేమాట. 

Readmore!

మరి, విభజన చట్టాన్ని మించి చంద్రబాబు మారాం చేసి, బెదిరించి ఆంధ్రప్రదేశ్‌కి లాక్కొచ్చినదేంటో ఆయనకే తెలియాలి.

Show comments