దృష్టంతా హైదరాబాదు మీదనే...!

తెలుగులో 'బలవంతపు బ్రాహ్మణార్ధం' అనే సామెత ఉంది. బ్రాహ్మణార్థం అనే మాట బ్రాహ్మణుల ఇళ్లలో తద్దినాల సమయంలో ఉపయోగిస్తారు. దాని చరిత్ర అప్రస్తుతం. ఈ సామెత అర్థం 'బలంతంగా పనిచేయించడం' అని. ప్రస్తుతం ఆంధ్రా రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇదెక్కడి బాధరా భగవంతుడా అన్నట్లుగా పనిచేస్తున్నారు. కుటుంబాలను హైదరాబాదులో ఉంచి ఇక్కడ పనిచేయాల్సిరావడంతో ముళ్ల మీద ఉన్నట్లుగా ఫీలవుతున్నట్లు సమాచారం.

 సచివాలయంలో అసలే అరకొర సౌకర్యాలు. ఇంకా పూర్తికాని నిర్మాణాలు. కుటంబాలకు దూరంగా జీవితం. దీంతో ఉద్యోగుల, అధికారులు దృష్టి ఎంతసేపటికీ హైదరాబాదు మీదనే ఉంటోంది తప్ప పనిమీద ఉండటంలేదు. సచివాలయం ఉద్యోగులకు ప్రస్తుతం వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఎంత వేగంగా జరుగుతాయో, ప్రజల సమస్యలు ఎంత త్వరగా పరిష్కారమవుతాయో జనాలకు అనుభవమే. సకల సౌకర్యాలున్న హైదరాబాదు సచివాలయంలో ఉన్నప్పుడే 'నత్త నడక' పనులు చేసే ఉద్యోగులు అరకొర సౌకర్యాలున్న వెలగపూడి సచివాలయంలో చురుగ్గా, వేగంగా పనులు చేస్తారని అనుకోలేం. 

అందులోనూ కుటుంబాలకు దూరంగా ఉన్నప్పుడు 'మూడ్‌' అసలుండదు. ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉండాల్సివస్తుందనే ఉద్దేశంతోనే వారు హైదరాబాదుకు వెళ్లొచ్చేందుకు వీలుగా ప్రభుత్వం శనివారం కూడా సెలవిచ్చి ఐదు రోజుల పని విధానం అమలు చేస్తోంది. అయినా ఉద్యోగులు, అధికారులు తృప్తిపడటంలేదు. కుటుంబాలతో గడపడానికి ఈ రెండు రోజులు చాలవనుకుంటున్నారు. దీంతో కొందరు గురువారం రాత్రే చెక్కేస్తుండగా, మరికొందరు శుక్రవారం ఉదయం వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోవడం తప్పు కదా. 

అందుకే డిపార్టుమెంటుకు సంబంధించిన సమావేశాలని,  అసెంబ్లీ కమిటీ మీటింగులని, కోర్టు కేసులని కారణాలు చూపించి బ్యాగు సర్దుకుంటున్నారు. అసలు అంతంతమాత్రంగా పని జరుగుతుంటే మరొక రోజు వృథా అవుతోంది. శక్రవారం సచివాలయానికి వస్తున్న జనాలకు, టీడీపీ నాయకులకు ఉద్యోగులు, అధికారులు కనబడటంలేదు. దీంతో పనులు కాక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులను కంట్రోల్‌ చేయాల్సిన అధికారులు కూడా హైదరాబాదుకు వెళ్లిపోతుంటే ఇంకెవరు పట్టించుకుంటారు. అందరూ బాధితులే కదా. 

Readmore!

ఇంక లాభం లేదనుకున్న టీడీపీ నాయకులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. 'ఇలా జరుగుతోందా' అని ఆశ్చర్యపడిన బాబు 'శుక్రవారం తప్పనిసరిగా సచివాలయంలో ఉండాలి' అంటూ అందరు ఉద్యోగులు, అధికారులకు ఉత్తర్వులు జారీ చేయించారు. సచివాలయాన్ని వంద శాతం పూర్తి చేయించి, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాక హైదరాబాదు నుంచి ఉద్యోగులను తరలిస్తే ఇంత బాధ ఉండకపోయేది. ఉద్యోగులు తమ బాధలు చెప్పుకుంటే 'నేనూ ఒంటరిగానే ఉంటున్నాను. నా కుటుంబం కూడా హైదరాబాదులోనే ఉంది' అని బాబు చెబుతున్నారు. 

ఆయన ఒంటరిగా ఉండటానికి, ఉద్యోగులు ఉండటానికి చాలా తేడా ఉంది. ఆయన శత కోటీశ్వరుడు. ఇంట్లో, ఆఫీసులో సకల సౌకర్యాలున్నాయి.  తలచుకుంటే హెలికాప్టర్లో లేదా విమానంలో హైదరాబాదుకు వెళ్లిపోగలరు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడగలరు. స్కూళ్లలో, కాలేజీల్లో చదువుకునే పిల్లలు లేరు. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదు. ఫ్యామిలీకి సంబంధించిన ఇతర ఏ రెస్పాన్స్‌బిలిటీస్‌ లేవు. ఆయన అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి అమరావతిలో వెలగపూడి నుంచి పనిచేయడం ఆయనకు బలవంతపు బ్రాహ్మణార్థం కాదు. 

ఆయనకు, ఉద్యోగులకు మధ్య దోమకు, ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది.  వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల బాధలపై మీడియాలో ఇప్పటికే అనేక కథనాలొచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తోందో తెలియదు. ఇక తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం కూడా నత్తనడకన నడుస్తోందని సమాచారం. శీతాకాల సమావేశాలు ఇక్కడే జరుగుతాయని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ హైదరాబాదులో జరిగిన సమావేశాల్లోనే ప్రకటించారు. కాని అనుకున్నంత వేగంగా అసెంబ్లీ పనులు జరగకపోవడంతో ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. మళ్లీ హైదరాబాదులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి వస్తే పరువు పోయినట్లే....!

Show comments