బీజేపీకి సై'కిల్' షాక్

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించబోతోందంటూ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చెబుతున్న వేళ, ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. అంతలోనే, ఆ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చింది ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌ వాదీ పార్టీ. 'అవసరమైతే, మేం బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మద్దతు తీసుకుంటాం.. బీజేపీని మాత్రం అధికారంలోకి రానివ్వం..' అంటూ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యానించేసరికి, బీజేపీకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. 

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 202. సర్వే ఫలితాల్ని బట్టి చూస్తే బీజేపీ, మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయంగానే కన్పిస్తోంది. అయితే, 190 సీట్ల వద్దనే బీజేపీ ఆగిపోతుందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం ఇంకో 13 సీట్లు బీజేపీకి అవసరం. మరోపక్క, కాంగ్రెస్‌ - ఎస్పీ కూటమితో (120 ప్లస్) బీఎస్పీ (90 ప్లస్) కలిస్తే (ఇవన్నీ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం మాత్రమే) మ్యాజిక్‌ ఫిగర్‌ ఈజీగా దాటేయొచ్చు. ఈ సమీకరణాలతోనే అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్పీకి స్నేహహస్తం అందించినట్టున్నారు. 

ఇక, అఖిలేష్‌ వ్యూహాలతో ఖంగుతిన్న భారతీయ జనతా పార్టీ, ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి అఖిలేష్‌ వ్యాఖ్యలే నిదర్శనమనీ, సర్వే ఫలితాల్ని మించి తమకు మ్యాజిక్‌ ఫిగర్‌ని దాటే ఫలితాలు వస్తాయని బీజేపీ నేతలంటున్నారు. ఏమో, శనివారం (మార్చ్‌ 11)న ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ఫలితాలు ఎలా వస్తాయోగానీ, అఖిలేష్‌ వ్యూహాలు ఫలిస్తే, బీజేపీ - యూపీలో గెలిచినా ఓడినట్లే అవుతుంది.

Show comments