నరసింహా సినిమాలో రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై కొన్ని డైలాగులు ఉంటాయి. పరోక్షంగా రజనీకాంత్ పై పంచ్ లే అవి. ఆ సినిమాలో రాజకీయ నేత అయిన రజనీ స్నేహితుడొకరు.. రజనీని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాడు. దానికి నరసింహ పాత్రధారి అయిన రజనీ ‘దేవుడు ఆదేశించాలి..’ అన్నట్టుగా చెబుతాడు. అప్పుడు రజనీ ఫ్రెండ్ .. ‘వీడొకడు రాజకీయం అంటే చాలు అలా వేలు పైకి చూపుతాడు..’ అంటాడు.
నరసింహా దాదాపు ఇరవై యేళ్ల కిందటి సినిమా.. మరి అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదు. “వేలు పైకి చూపడమే..’. మరి ఈ నేపథ్యంలో కుండబద్దలు కొట్టినట్టుగా స్పందించింది నటీమణి కస్తూరి.
ఆ మధ్య కాస్టింగ్ కోచ్ గురించి, తనను ఒక హీరో వేధించాడని, ప్రస్తుతం అతడు రాజకీయాల్లో ఉన్నాడని చెప్పిందే.. ఆ కస్తూరినే.. ఇప్పుడు రజనీ రాజకీయంపై పంచ్ లు వేసింది.
రజనీకాంత్ నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నాడని కస్తూరి ట్వీట్ చేసింది. వస్తానో.. రానో.. సరిగా చెప్పలేకపోతున్నాడని.. యుద్ధం, యుద్ధం అంటూ రజనీ బోర్ కొట్టిస్తున్నాడని కస్తూరి సూటిగా అనేసింది. మరి పైకి చెప్పకపోయినా చాలా మంది అభిప్రాయం ఇదే.
రెండు, రెండున్నర దశాబ్దాల నుంచి వేలు పైకి చూపుతూనే గడిపేస్తున్నారు. జయ మరణంతో ఏర్పడిన పరిస్థితుల్లో మాత్రం రజనీలో కొంత ధైర్యం వచ్చినట్టుగా ఉంది. మరి ఇప్పుడు కూడా రజనీ డేర్ గా ముందుకు రాలేకపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. మరేం జరుగుతుందో!