పొమ్మనలేక పొగపెట్టడమంటే ఇదే

శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరిపోయాక, సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిపై రాజకీయంగా కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరగడం సహజమే. పైగా, జిల్లాలో భూమా కుటుంబంతో శిల్పా కుటుంబానికి రాజకీయ వైరం ఓ రేంజ్‌లో వుందాయె.

అన్నిటికీ మించి 'శిల్పా బ్రదర్స్‌'గా కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి పాపులర్‌ అయ్యారు. ఈ ఇద్దరిలో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో వుంటే, ఆటోమేటిక్‌గా కార్యకర్తల్లో గందరగోళం పెరిగిపోతుంది. 

'పార్టీ మారింది శిల్పా మోహన్‌రెడ్డి మాత్రమే.. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలోనే వున్నారు.. ఎవరూ శిల్పా బ్రదర్స్‌ పేరుతో హడావిడి చేయొద్దు..' అంటూ టీడీపీ నేతలు చెబుతోంటే, శిల్పా బ్రదర్స్‌ అభిమానులు, టీడీపీ నేతలపై గుస్సా అవ్వాల్సి వస్తోంది.

వెళుతూ వెళుతూ తనతోపాటు పెద్ద సంఖ్యలో కింది స్థాయి నేతల్ని, కార్యకర్తల్ని శిల్పామోహన్‌రెడ్డి తీసుకెళ్ళారంటే, ఆ వెనకాలే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వెళతారని అనుకోవడం తప్పెలా అవుతుంది.? 

పైగా, 'నేను పార్టీ మారను..' అని శిల్పా చక్రపాణిరెడ్డి పైకి చెబుతున్నా, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలు, శిల్పా మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్సీపీలోకి వెళ్ళిపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

శిల్పా బ్రదర్స్‌ ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకున్నారనీ, సరిగ్గా ఉప ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి షాక్‌ ఇస్తారనీ ప్రచారం జరుగుతోంది. 

అన్నట్టు, శిల్పా చక్రపాణిరెడ్డికి టీడీపీలో టీడీపీ నేతలే పొగపెడ్తుండడం గమనార్హమిక్కడ. ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అభద్రతాభావం చాలా చాలా ఎక్కువ.

తన కనుసన్నల్లో పనిచేసే మీడియా సంస్థల ద్వారా శిల్పా చక్రపాణిరెడ్డిపై దుష్ప్రచారం షురూ చేసేసి, అతన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చంద్రబాబు చేయడం మామూలే. అదే సమయంలో, ఆ వేధింపులు తట్టుకోలేక శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Show comments