ఇదే ప్రజాస్వామ్యం.. ఇలాగే వుంటది.!

కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓటర్లను (స్థానిక సంస్థల ప్రజా ప్రతినిథుల్ని) క్యాంపులకు తరలించేయడం, వారికి అక్కడ పది పదిహేను రోజులపాటు ‘శిక్షణ’ ఇవ్వడం జరిగిపోయింది. ఇక్కడ శిక్షణ అంటే, దాచిపెట్టడమన్నమాట. నేడు పోలింగ్‌ సందర్భంగా, క్యాంపులకు వెళ్ళినవారంతా తిరిగి వచ్చారు. ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. 

నిజానికి, ఈ మూడు జిల్లాల్లో మెజార్టీ వైఎస్సార్సీపీకే వుంది. కానీ, 'ఎలాగైనా గెలిచేయాలి..' అనే కసితో, అధికార పక్షం అభ్యర్థుల్ని నిలబెట్టింది. పార్టీ ఫిరాయింపులు, బెదిరింపులు, ప్రలోభాలు.. ఇలా సవాలక్ష 'ప్రజాస్వామ్య పద్ధతుల్లో' ఎన్నికల్ని ఫేస్‌ చేస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ. ఏం చేసినా, గెలుపు తమదేనంటోంది ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. 

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోట్లు గుమ్మరించేయడానికి వెనుకాడని తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వుంది గనుక.. ఇక్కడస్సలేమాత్రం తగ్గే ప్రసక్తే లేదు. అందుకే, క్యాంపు రాజకీయాల్ని ఘనంగా నిర్వహించేసింది. అఫ్‌కోర్స్‌, తమ ఓటర్లను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సైతం క్యాంపులు నిర్వహించలేదనుకోండి.. అది వేరే విషయం. 

అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటి.? ఎన్నికల ప్రక్రియ అంటే ఏంటి.? ఓటరు స్వేచ్ఛగా ఓటేస్తేనే కదా, అది ప్రజాస్వామ్యం. అప్పుడే కదా, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగినట్టు.? కానీ, బస్సుల్లో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడాన్ని ఏ నైతిక విలువలకు, ఏ ప్రజాస్వామ్య పద్ధతులకు నిదర్శనమని అంటారో ఏమో.! ఇప్పుడు ఎవరు గెలిచినా, వాళ్లు పెద్దల సభకు వెళతారు. పెద్దల సభకు గౌరవం తీసుకొచ్చేస్తారు. ఎలా.? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేయడం ద్వారానా.? ఆ ఒక్కటీ అడక్కండంతే.!

Show comments