పవన్ కల్యాణ్ బాధితుల నిరాహార దీక్ష మొదలైంది...!

ఒకవైపు ఎవ్వరినీ వదలను, అందరినీ ప్రశ్నిస్తా.. అంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాన్ సమాధానం చెప్పుకోవాల్సిన సమయం వచ్చినట్టుగా ఉంది. తాము పవన్ బాధితులం అంటూ తమకు న్యాయం చేయాలంటే కొంతమంది రోడ్డు ఎక్కారు, నిరాహార దీక్షను మొదలుపెట్టారు. తమకు అన్యాయం జరిగిందని, కోట్ల రూపాయలు నష్టపోయామని వారు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని.. తమను పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని.. నిరాహార దీక్షకు దిగారు వాళ్లు.

 హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ వద్ద ‘సర్ధార్ గబ్బర్ సింగ్ పంపిణీదారుల సంఘం నిరాహార దీక్ష’ మొదలైంది. ఈ లొల్లి గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. పవన్ కల్యాణ్ నటించి, నిర్మించిన ఆ సినిమా హ్యూజ్ డిజాస్టర్ గా నిలిచింది. దానికి వచ్చిన భారీ హైప్ తో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలు పెట్టి సినిమా పంపిణీ హక్కులను కొన్నారు. అయితే సినిమా అట్టర్ ప్లాఫ్ కావడంతో.. పవన్ కల్యాణ్ కు ఏమీకాలేదు కానీ, డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు. ఇలాంటి వారికి అప్పట్లో పవన్ సన్నిహితుల నుంచి ఒక హామీ లభించిందట.. తాము పవన్ కల్యాణ్ తోనే తదుపరి ఒక సినిమా చేస్తాము.. దాని పంపిణీ హక్కులను సరసమైన ధరలకు మీకే ఇస్తాం లేని వారు చెప్పారట. అయితే తీరా పవన్ తో అదే శరత్ మరార్ తదుపరి సినిమాను రెడీ చేసినా.. దాని పంపిణీ హక్కులను తమకు ఇవ్వడం లేదు.. అని పంపిణీదారులు అంటున్నారు. 

ఈ విషయమై ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టిన వీళ్లు.. ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహారదీక్ష మొదలుపెట్టారు. మరి వీరంతా ఎవరో కాదు.. ఒక సమయంలో పవన్ ను దేవుడు అనుకన్నవారేనట. ఈ విషయాన్నీ వారే చెబుతున్నారు. పవన్ ను తాము దేవుడు అనుకున్నామని.. అయితే ఇప్పుడు అదే దేవుడి వల్ల తమకు అన్యాయం జరిగిందని న్యాయం చేయమని అంటున్నారు.. పవన్ సన్నిహితులపై డైరెక్టుగా అటాక్ చేస్తున్నారు. మరి నిరాహార దీక్ష వరకూ వచ్చింది వ్యవహారం.. తామెన్ని కోట్లు నష్టపోయారో కూడా వారు చెబుతున్నారు. మరి పవన్ వీరికి న్యాయం చేస్తాడా? లేక ఇదంతా తమ వైరిపక్షాల కుట్ర అని పవన్ ఫ్యాన్స్ అంటారా?

Readmore!
Show comments

Related Stories :