తీరంలో కెరటాలు పోటెత్తాయ్‌.!

ఓ సినిమాలో ప్రభాస్‌ చెప్పే సూపర్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది. నిజంగానే తీరంలో కెరటాలు పోటెత్తాయ్‌.. అయితే ఈ పోటు, భారత బౌలర్ల నుంచి.. భారత బౌలింగ్‌ సునామీకి కివీస్‌ బెంబేలెత్తిపోయింది. విశాఖలో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 190 పరుగుల తేడాతో టీమిండియా, కివీస్‌పై విజయం సాధించడం విశేషం కాక మరేమిటి.? 

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 269 పరుగులు చేసింది. 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌, కేవలం 23.1 ఓవర్లకే ఆలౌట్‌ అయిపోయింది. గట్టిగా 100 పరుగులూ చేయలేక, 79 పరుగులకే కుప్ప కూలిపోయింది. కివీస్‌ని దెబ్బ కొట్టడంలో మిశ్రా తనదైన ముద్ర వేశాడు. ఐదు వికెట్లు సాధించాడు మిశ్రా. చివరి వన్డేలోనే కాకుండా, ఈ సిరీస్‌ మొత్తంలో బాగా రాణించినందుకుగాను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తోపాటు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా మిశ్రాకే దక్కింది. 

నిజానికి, విశాఖ మైదానంలో 269 పరుగులంటే పెద్ద స్కోర్‌ ఏమీ కాదు. కానీ, అనూహ్యంగా బంతి గిరగిరా తిరిగింది. ఆ తిరగడమే టీమిండియాకి కలిసొచ్చింది. ఒక్క పరుగూ చేయకుండానే కివీస్‌ ఓపెనర్‌ గుప్టిల్‌ వికెట్‌ పారేసుకోవడంతో ఆ జట్టు పతనం ప్రారంభమయ్యిందనే చెప్పాలి. అక్కడినుంచి ఎవరూ ఎక్కడా కివీస్‌ని ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. ఐదుగురు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారంటే భారత బౌలర్ల ఊచకోత ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. వారిలో టాప్‌ స్కోర్‌ విలియమ్‌సన్‌ (27) మాత్రమే. 

విశాఖ వన్డేలో గెలుపుతో టీమిండియా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని కివీస్‌పై 3-2 తేడాతో గెల్చుకుంది.

Show comments