జైరా.. నీ వెంట మేమున్నాం: అమీర్‌ఖాన్‌

'దంగల్‌' నటి జైరా వాసిమ్‌, సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని కలవడమే ఆమె చేసిన నేరం. ఓ నటి, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే అది నేరమవుతుందా.? ఏమో మరి, జమ్మూకాశ్మీర్‌లో కొందరు 'అతివాదులకు' అది తప్పుగానే కన్పించింది. కారణం, గత కొంతకాలంగా జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా వుండడమే. యువత, తుపాకీ గుళ్ళకు బలైపోతున్నారన్నది ఆ 'అతివాదుల' ఆరోపణ. నిజమే, యువత మాత్రమే కాదు.. సైన్యం కూడా అక్కడ తుపాకీ గుళ్ళకు బలైపోతోంది. 

పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం, జమ్మూకాశ్మీర్‌ యువతని సర్వనాశనం చేస్తోంది. 'ఆజాద్‌ కాశ్మీర్‌' పేరుతో, కాశ్మీర్‌లో పాకిస్తాన్‌ సైన్యం, పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం సృష్టిస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. కానీ, చిత్రంగా ఓ పదహారేళ్ళ యువతి, ఓ సినిమాలో నటించి, ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటే, ఆ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆ యువతికి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందితే, ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ యువ నటి, ముఖ్యమంత్రిని కలిస్తే.. అతివాదులు జీర్ణించుకోలేకపోయారు. 

నిజానికి, ఈ తరహా బెదిరింపులకు జైరా గట్టిగా తట్టుకుని నిలబడి వుండాల్సింది. కానీ, క్షమాపణ చెప్పేసింది అతివాదులకి. సరిగ్గా ఈ సమయంలోనే బాలీవుడ్‌ ఆమెకు బాసటగా నలిచింది. 'దంగల్‌' హీరో అమీర్‌ఖాన్‌ అయితే, జైరా నీ వెంట మేమున్నాం, ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.. ధైర్యంగా వుండమని పిలుపునిచ్చాడు. కానీ, జైరా క్షమాపణతోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడ, అతివాదులకు తలొగ్గినట్లే అయిపోయింది. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ, ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమీర్‌ఖాన్‌, ఈ అసహనాన్ని మాత్రం ఎలివేట్‌ చేయకుండా, జైరాకి మద్దతు పలికేసి ఊరుకోవడమేంటో.!

Readmore!
Show comments