కేశినేనీ.. వాళ్ళని ఉద్ధరించవయ్యా.!

''జనోద్ధరణ కోసమే రాజకీయాల్లోకొచ్చా.. ప్రైవేటు ట్రావెల్స్‌ కోసం పదవిని అడ్డం పెట్టుకోలేదు.. ఇంకో పదేళ్ళు నష్టాల్లో వున్నా, సంస్థని నడిపే సత్తా నాకుంది..'' 

- టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని ఈ మధ్యనే తన కారణంగా ప్రభుత్వానికి 'మచ్చ' రాకుండా వుండేందుకు, పార్టీ 'పరువు' పోకుండా వుండేందుకు కేశినేని ట్రావెల్స్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. తానెంతో చిత్తశుద్ధితో ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాననీ, తన మీద ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా ట్రావెల్స్‌కి సంబంధించి రాలేదనీ చెప్పుకున్నారాయన. 

కానీ, ఎప్పుడైతే ట్రావెల్స్‌ మూసివేస్తున్నట్లు కేశినేని నాని సంకేతాలు పంపారో, ట్రావెల్స్‌కి సంబంధించిన సిబ్బంది నెత్తిన పిడుగు పడ్డట్లయ్యింది. అప్పటికే చాలా కాలం నుంచి తమకు జీతాలు రావడంలేదనీ, ఈ టైమ్‌లో ట్రావెల్స్‌ మూసేస్తే తమ బతుకులేమవుతాయని వాపోతూ, కేశినేని ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు గతంలోనే. తాజాగా మరోమారు కేశినేని సిబ్బంది ఆందోళన బాట పట్టారు. 

కేశినేని సిబ్బంది చెబుతున్నదాన్ని బట్టి చూస్తే 8 నెలల నుంచి జీతాలు వారికి అందలేదన్న విషయం అర్థమవుతోంది. వ్యవహారం తేడాగా వుందని కేశినేని నానికి రెండేళ్ళ క్రితమే అర్థమయ్యిందని.. ఈ మధ్యనే చూచాయిగా ఆయనా సెలవిచ్చారు. 'రెండేళ్ళ నుంచి నష్టాల్లో వున్న మాట వాస్తవం..' అని నాని చెప్పారంటేనే, మేటర్‌ క్లియర్‌. కంపెనీ నష్టాల కారణంగా ట్రావెల్స్‌ మూసేస్తే, ఎంపీగా పరువు పోతుంది. అందుకే, ఓ వివాదాన్ని అడ్డంపెట్టుకుని, ఇదిగో ఇలా 'మూసివేత' నాటకానికి తెరలేపారన్నమాట. 

మొత్తమ్మీద, సిబ్బంది రోడ్డున పడ్డారు. ఎంపీగారేమో, పదేళ్ళపాటు నష్టాల్లోనే అయినా ట్రావెల్స్‌ని నడిపే సత్తా వుందంటున్నారు. అంత సత్తా వుంటే, ముందు సిబ్బంది జీతాల సంగతి చూడొచ్చు కదా.! 

మొత్తమ్మీద, ఆర్‌టీఏ కమిషనర్‌పై దాడి, చంద్రబాబు మధ్యవర్తిత్వం, కేశినేని నాని అలక, కేశినేని ట్రావెల్స్‌ మూసివేత, సిబ్బంది ఆందోళన.. అబ్బో, ఈ రాజకీయం కెవ్వు కేక అనకుండా వుండగలమా.? ప్రజల్ని ఉద్ధరించేస్తామని చెప్పే ఓ ప్రజా ప్రతినిథి, తన దగ్గర పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడమట.. సిబ్బందికే జీతాలు ఇవ్వలేకపోతే.. జనాన్ని ఎలా ఉద్ధరించేస్తరాట.?

Show comments